కృష్ణ జింకలను చూస్తుంటే సహజంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చెంగు చెంగున గెంతుతూ పరుగెడుతుంటే పిల్లలు, పెద్దలు సైతం ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం అందుకు విరుద్దం.. వాటిని చూస్తే చాలు రైతులు వామ్మో అంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. జింక‌లు సంచ‌రించే ప్రాంతాల్లో సాగు చేసే దైర్యం చేయ‌డం లేదు అన్నదాత‌లు. 


తెలంగాణ రాష్ట్రంలోని నారాయ‌ణ పేట జిల్లా  మాగనూరు, మక్తల్‌, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో కృష్ణా న‌ది స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో  కృష్ణ జింకలు వేల సంఖ్యలో ఉన్నాయి.  వాటి సంత‌తి ఇటీవ‌ల కాలంలో మ‌రింత‌గా పెరిగింది.  ఇవి అక్కడి పొలాల్లో తిరుగుతూ పంట‌లు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంత  శివారులలో గొర్రెల మందలను తలపించేలా జింక‌లు తిరుగుతున్నాయి. దీంతో రైతులు ఆయా పంట‌లు సాగు చేద్దామంటేనే వ‌ణికి పోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో సమయానికి సరైన వర్షాలు పడక పోవడంతో కొంత ఆలస్యంగానే సాగు చేపట్టిన అన్నదాతలు... కృష్ణా  నదికి వచ్చిన వరదతోనూ కొంత నష్టపోయారు. ఇక ఉన్న పంటలనైనా కాపాడుకొని, పెట్టుబడులైనా వెళ్లదీద్దాం అనుకున్న రైతులకు జింకల బెడద తలనొప్పిగా మారింది. 


ఈ ప్రాంతంలో విత్తనం నాటి మొక్క మొలకెత్తిందంటే చాలు పంటను తినేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పత్తి, కంది, వరి, పల్లి, ఆముదం, మొక్కజొన్న ఇలా ఏ పంటనూ వదలడం లేదని చెబుతున్నారు.  ఒక్కసారి మంద వచ్చి పడితే క్షణాల్లో ఎకరం పంట తినేస్తున్నాయని ... దీంతో ఏ పంట వేద్దామ‌న్నా వెనుకా ముందు ఆలోచించాల్సి వ‌స్తుంద‌ని శివారు గ్రామాల్లోని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి  ఖరీఫ్ కు సాగుకు సిద్దమ‌వగా... ఓ పక్క ప్రకృతి పగబట్టగా... మరో పక్క జింకల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని  రైతులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. పండించిన పంట‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుతున్నా... స‌గం జింక‌లకే ఆహ‌రంగా మారుతుంద‌ని వాపోతున్నారు.  జింక‌ల పార్క్ ఏర్పాటుతో స‌మ‌స్య తీరుతుంద‌ని అనుకున్నా ప్రభుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేదంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: