జీఎస్టీ ఆదాయం శరవేగంగా దూసుకుపోతోంది. నవంబర్ లో వస్తుసేవల పన్ను లక్ష కోట్ల మార్కును దాటింది. గతేడాదితో పోలిస్తే ఆరు శాతం అధికంగా నమోదైంది. జీఎస్టీ ఆదాయం అంచనాలకు మించి  పెరుగుతున్నా.. తమకు మాత్రం ఎలాంటి పరిహారం అందడం లేదని రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. 

 

వస్తు సేవల పన్ను ఆదాయం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసింది. నవంబర్ నెలలో వస్తుసేవల పన్ను ఆదాయం పెరిగింది. ఈ మొత్తం లక్షకోట్ల రూపాయల మార్కును దాటేసింది. గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి  లక్షా 3వేల కోట్లకు చేరింది. 2018 నవంబర్‌ నెలలో 97 వేల 637 కోట్ల రూపాయలుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. ఈసారి నవంబర్‌లో స్థూలంగా లక్షా 3 వేల 492 కోట్ల రూపాయలకు చేరింది. వీటిలో సీజీఎస్‌టీ 19 వేల 592  కోట్లు, ఎస్‌జీఎస్‌టీ 27 వేల 144 కోట్లు, ఐజీఎస్‌టీ 49 వేల 028 కోట్లు కాగా.. సెస్‌ రూపంలో 7 వేల 727 కోట్ల రూపాయలు  వచ్చాయి. ఓవైపు వృద్ధిరేటు తగ్గుతూ వస్తుండగా.. జీఎస్టీ మాత్రం పెరుగుతూ పోతోంది. ఈ  ఏడాదితో పోల్చుకొంటే 12శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం విశేషం. 

 

గూడ్స్‌ అండ్‌ సర్వీసు ట్యాక్స్‌ పరిహారాన్నిరాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి  ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. 


జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్‌కు 4 వేల 400 కోట్లు, ఢిల్లీకి 2 వేల 355 కోట్ల రూపాయలు కేంద్రం చెల్లించాల్సి ఉంది. పంజాబ్‌కు 2 వేల 100 కోట్లు, కేరళకు  పదహారు వందలకోట్లు , పశ్చిమ బెంగాల్‌కు పదిహేను వందల కోట్ల  రూపాయలు చెల్లింపులు చేయాలి.ఈ ఏడు నెలల కాలానికి చెల్లింపులకోసం  కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని మంత్రులు తెలిపారు. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: