వెండి ధ‌ర‌లు ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్నాయి. శ్రావ‌ణ‌మాసం ఎంట‌ర‌వడంతో ధ‌ర‌లు పైపైకి ఎగిరిపోతున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా దేశీ మార్కెట్‌లో వెండి ధర పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. ఇక  బంగారం ధర కూడా పరుగులు పెడుతుంది. కొత్త రికార్డుల‌ను సృష్టిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరింది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుదగ్గులకు లోనవుతున్న బంగారం ధర.. మ‌రోసారి హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. దీంతో ప్రజలు పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు. అందులోనూ వ‌చ్చేది శ్రావ‌ణ మాసం కనుక బంగారం రేటు తగ్గుతుందోమోనని.. పసిడి ప్రియులు ఎదురు చూస్తుంటే వారికి షాక్ ఇస్తూ హై రేటుకు చేరుకుంది.


 తాజాగా ఇవాళ కూడా గోల్డ్ ధ‌ర‌ భారీగా పెరిగింది. అలాగే అంత‌ర్జాతీయంగా మార్కెట్లో ప‌సిడి ధ‌ర పెరుగుద‌ల కూడా దీనికి తోడైంది. ఇక మంగళవారం వెండి ధర కేజీకి రూ.1295 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.55,300కు చేరింది. అలాగే వెండి ధర నిన్న కూడా భారీగా పెరిగింది. రూ.1150 పైకి కదిలింది. అంటే వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే రూ.2,400కు పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వెండి ధర పరుగులు పెడుతూ వస్తోంది. ఏకంగా 20 డాలర్ల పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1.6 శాతం పెరుగుదలతో 20.22 డాలర్లకు చేరింది. 2016 ఆగస్ట్ నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అంటే వెండి ధర నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. 

 

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ద‌ర రూ.400 పెరిగి రూ.49,100కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.400 పెర‌గ‌డంతో రూ.47,900గా ఉంది. కాగా ప్ర‌స్తుతం పెరిగిన ఈ రేట్ల‌తో పసిడి ప్రియులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ‌చ్చే శ్రావ‌ణ మాసం క‌నుక గోల్డ్ రేటు  మ‌రింత‌ పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.ఇకపోతే ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర మాత్రమే కాకుండా బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర 0.23 శాతం పెరిగింది. దీంతో ధర రూ.49,140కు ఎగసింది. కాగా బంగారం ధర ఈ నెల ఆరంభంలోనే రూ.49,348 గరిష్ట స్థాయిని చేరిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: