చికెన్.. ఒకప్పుడు వారాంతంలో మాత్రమే తినే ఈ నోరూరించే వంటకం గత కొన్ని రోజులుగా రోజువారీ దినచర్యలో భాగమైపోయింది.  మన దేశంలోనే కాదు ప్రపంచంలో చికెన్ కు మంచి గిరాకీ ఉంటుంది.. వారాంతాల్లో హాట్ కేకులా అమ్ముడవుతుంది.. కొంతమందికి రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు.  అందుకే కాబోలు ప్రతిరోజు వారి డైనింగ్ లో చికెన్ ని భాగస్వామ్యం చేస్తుంటారు. ఇదివరకు పండగకు, పబ్బానికో చికెన్ ని తెచ్చుకునే వారు ఇప్పుడు మూడొస్తే చికెన్ అంటున్నారు.. మందు చిందులకు, పార్టీ లైనా, పండగలైనా ప్రతి ఒక్కరి మెనూ లో చికెన్ ఉండాల్సిందే.. పైగా చవక ధర.. ఊరుకుంటారా..

రోజుకో వెరైటీ తో ఒక్కో పేరు చెప్పి చికెన్ పలురకాలుగా తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. హైదరాబాద్ లో అయితే చికెన్ వాడకం ఏ రేంజ్ లో ఉందో ఇప్పటి పరిస్థితి ని బట్టి చెప్పొచ్చు.. ముఖ్యంగా కొన్ని ఏరియా ల్లో చికెన్ షాప్ లముందు ఎప్పుడు క్యూ లైన్ ఉంటుంది.. అయితే అందుకేనేమో చికెన్ తినటంతో దేశంలోనే హైదరాబాద్ టాప్  ప్లేస్ లో నిలిచింది. ఈ విభాగంలో దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానం ఉంది. బెంగళూరు మూడోస్థానంలో ఉంది. చికెన్ లో పోషక విలువలు, ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండటంతో పైగా మటన్ కంటే చికెన్ ధర తక్కువగా ఉండటంతో అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది.

మధ్య మధ్య లో చికెన్ తింటే ఆ వ్యాధి ఈ వ్యాధి అంటూ వార్తలు వచ్చిన చికెన్ ని తినడం ఎవరు తగ్గించలేదు. పోతే పోనీ వెధవ ప్రాణాలు అన్నట్లు తిన్నారు. ఇక కరోనా సమయంలో చికెన్ తిన్నోళ్లకి తిన్నంత.. కరోనా తో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చికెన్‌ తినాలి అని చెప్పడంతో వారాంతంలో తినేవారు కూడా రోజూ తినడం మొదలుపెట్టారు.. దాంతో ఒక్కసారిగా అమ్మకాలు భారీగా పెరిగాయనే చెప్పాలి.  చికెన్‌ వెరైటీల్లోనూ హైదరా‘బాద్‌షా’గా మారింది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీవాసులు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్‌ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నారని ఫుడ్‌ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. కోవిడ్‌ తరువాత గ్రేటర్‌లో రోజూ 6 లక్షల కిలోల వినియోగం ఉండగా ఢిల్లీలో 5.5 లక్షలు, బెంగళూరులో 5 లక్షల వరకు చికెన్‌ విక్రయాలు జరుతున్నాయని పౌల్ట్రీ రంగం అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: