ఓవైపు కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ముంచేస్తున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టీ కరోనా వ్యాక్సీన్లపైనే పడింది. భారత్‌లో కరోనా టీకాలు ఉత్పత్రి చేసే సంస్థలు కేవలం రెండే ఉన్నాయి. దీంతో వాటిపై రాష్ట్రాల ఒత్తిడి పెరిగింది. ఆ సంస్థలు కేంద్రం చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీ చేయాలంటూ ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.

ఇలాంటి సమయంలో కొందరు వైసీపీ నేతలు భారత్ బయోటెక్ కంపెనీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. భారత్ బయోటెక్‌ అధినేతల బంధుత్వాలను కూడా చర్చకు పెడుతున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి.. చంద్రబాబు ఆ కంపెనీకి ఏజంటా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాల కన్నా, తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా.. ఆ కంపెనీకి ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండి పడ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు.

మూర్ఖుడిలా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని జోగి రమేశ్ అంటున్నారు. శవాల దగ్గర డబ్బులు తీసుకునేవారికి, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం రేట్లు ఫిక్స్ చేసి బ్రోకరేజ్ చేసేవారికి, రెమిడెసివర్ల ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించి డబ్బులు గుంజేవారికి, ఏమాత్రం తీసిపోము అన్నట్టుగా.. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. మరోవైపు చంద్రబాబు, ఎల్లో మీడియా కనీసం మానవత్వం లేకుండా భారత్ బయోటెక్ కు భజన చేస్తున్నాయని జోగి రమేశ్ మండిపడ్డారు.

భారత్ బయోటెక్ రామోజీరావు కొడుకు వియ్యంకుడిదైనంత మాత్రాన, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు కులానికి చెందిన వ్యక్తిది అయినంతమాత్రాన.. వీళ్ళంతా దానికి ఏజెంట్లుగా మారిపోయారా..? శవాలు కాల్చే వ్యక్తులు, బ్లాక్ మార్కెట్ గాళ్ళ కంటే హీనంగా.. నారా చంద్రబాబు అండ్ కో తయారయ్యారంటే.. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది అంటూ జోగి రమేశ్ రెచ్చిపోయారు. అసలే కరోనా టీకాలు ప్రజలకు దొరకని ఈ పరిస్థితుల్లో ఓ వ్యాక్సిన్ సంస్థపై అలా నోరుపారేసుకోవడం ఏపీ ప్రజలకు మంచిదికాదన్న విమర్శలు వస్తున్నాయి. మరి వైసీపీ నేతలు ఈ విషయంలో ఆలోచించుకుంటే మంచిది.     


మరింత సమాచారం తెలుసుకోండి: