టీడీపీ లో ఇటీవలి కాలంలో ఒక కొత్త దిశలో పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు కాకుండా, ఆ బాధ్యతను తన వారసుడిగా భావిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు అప్పగించడం గమనార్హం. గతంలో పార్టీకి చెందిన సీనియర్ నేతల ఇళ్లలో జరిగే వివాహాలు, శుభకార్యాలు లేదా సాంఘిక కార్యక్రమాలకు వ్యక్తిగతంగా హాజరవుతూ ఉండే చంద్రబాబు, ఇప్పుడు ఆ స్థానం లోకేష్‌కు ఇస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ కీలక నాయకుడి కుమారుడి వివాహ రిసెప్షన్, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన స్కూలు ప్రారంభోత్సవం, ఇటీవల నిమ్మల రామానాయుడు కుటుంబంలో జరిగిన నిశ్చితార్థం వంటి కార్యక్రమాలకు చంద్రబాబు బదులు లోకేష్ వెళ్లడం దీనికి ఉదాహరణ. అంతేకాక, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి లోకేష్ పాల్గొనడం, ఆయనకు ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యం తీసుకొచ్చింది.


తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కుమార్తె ఎంగేజ్‌మెంట్‌కు కూడా లోకేషే వెళ్లారు. ఈ మార్పు వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భవిష్యత్తులో పార్టీ బాధ్యతలను పూర్తిగా నారా లోకేష్‌కే అప్పగించే అవకాశం ఉండటంతో, ఆయనను ప్రతి కోణంలోనూ మెల్లగా ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారని అంటున్నారు. కేవలం రాజకీయ కార్యక్రమాలకే కాకుండా, ఆత్మీయ సందర్భాలలోనూ లోకేష్ హాజరవడం వల్ల ఆయా కుటుంబాలకు మరింత చేరువ అవుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్‌ను పెంచడమే కాకుండా, పార్టీ పట్ల విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.


సీనియర్ నేతలు కూడా ఈ వ్యూహాన్ని సమర్థిస్తున్నారు. లోకేష్‌కి ఇస్తున్న ప్రాధాన్యం టీడీపీ భవిష్యత్ దిశలో ఒక మంచి అడుగు అని వారు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ తరహా కలయికలు ఆయనకు వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేస్తూ, రాజకీయ పునాదులను కూడా గట్టి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ మార్పును క్రమంగా అమలు చేస్తూ, భవిష్యత్తు నాయకుడిగా లోకేష్‌ను ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.టీడీపీలో నారా లోకేష్ ప్రాధాన్యం పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే పార్టీ పూర్తి బాధ్యతలు ఆయన భుజాలపై పడేందుకు ముంద‌స్తు సంకేతాలను ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: