ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల ముందు వాతావరణం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 18న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స‌మావేశాల‌కు హాజరవుతారా లేదా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అధికారికంగా జగన్‌ను సమావేశాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే ఆయన వస్తారా? రారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హీటెక్కించాయి. రాజంపేట స‌భ‌లో చంద్ర‌బాబు “దమ్ముంటే సభకురావాలి” అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.


చంద్రబాబు వైపు నుంచి వస్తున్న ఈ సవాల్ స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఏ అంశంపై అయినా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా గతంలో “మాకు మైక్ ఇవ్వరు” అని విమర్శలు చేసిన జగన్‌కు కౌంటర్ ఇస్తూ, ఇప్పుడు మైక్ మాత్రమే కాకుండా ఎక్కువ టైం కూడా ఇస్తామని చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలా ? వ‌ద్దా ? అన్న‌ది జ‌గ‌న్ కోర్టులో ప‌డింది. జగన్ అసెంబ్లీకి హాజరై ఉంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రైతుల సమస్యల‌పై చంద్రబాబును నిలదీయ‌వ‌చ్చు. ఈ వేదిక ఆయనకు బలమైన వాదనలు వినిపించే అవకాశాన్ని కలిగిస్తుంది. కానీ ఆయన సభకు దూరంగా ఉంటే అదే చంద్రబాబు బలమైన ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది. మాకు ఎదురుప‌డే ధైర్యం కూడా జ‌గ‌న్‌కు లేద‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి పంపుతారు.


ప్రజలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షం అసెంబ్లీలో లేకుండా బయట మీడియా స‌మావేశాల‌తో టైం వేస్ట్ చేసుకుంటే ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌దు. ఇది చంద్రబాబు నుంచి వచ్చిన మొదటి ప్రత్యక్ష సవాల్ కావడంతో ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే, అది రాజకీయంగా వెనుకంజ వేసినట్టే అవుతుందని, ప్రజల్లో ఆయనపై పిరికితనం అనే ట్యాగ్ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా ? అన్న‌దే ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: