నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే తెలంగాణ ఉద్యమానికి నినాదం.  దీంతో ఉద్యమానికి వెళ్లి, ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చారు కేసీఆర్.  సెంటిమెంట్ ను బాగా రగిల్చారు. ఆంధ్రా వాళ్లు బయటక వెళ్లిపోతే ఆ స్థానాలను తమ తో భర్తీ చేస్తారని ప్రతి నిరుద్యోగి భావించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం వహించారు పట్టించుకోవడం లేదు అని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించారు.  ఆ లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.


ప్రత్యేక రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు గడిచింది. అధికారం చివరి దశకు చేరింది. మళ్లీ  ఎన్నికలు సమీపిస్తుండటంతో చిరుద్యోగులు, నిరుద్యోగుల ఆగ్రహాన్ని కొంత మేర తప్పించేందుకు కొన్ని ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. కానీ ఉద్యోగ భర్తీల విషయంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని రాజకీయ పార్టీ నేతలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  దాని ఫలితం ఇప్పుడు నిరుద్యోగులు అనుభవిస్తున్నారు.


ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.  పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ 1 పరీక్షను జూన్ 11 నిర్వహించారు.  పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా.. హాల్ టికెట్ నంబరు లేకుండా ఓఎంఆర్ షీట్లు జారీ చేశారని ఈ పరీక్షను  రద్దు చేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.


గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు.  ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. గతంలో పేపర్ల లీకేజీతో పరీక్షను రద్దు చేశారు. ఒకసారి లీకేజీ కావడమే ఘోరమైన నిర్లక్ష్యం.. మళ్లీ పెట్టే పరీక్షను కూడా నిర్లక్ష్యంగా పెట్టడం అంటే ఇంకా ఏమనాలని నిరుద్యోగులు బూతులు తిడుతున్నారు. ఉద్యోగం వస్తుందేమో అనే ఆశతో స్తోమత లేకపోయినా అప్పు తెచ్చి మరీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న ఎందరో నిరుద్యోగులకు పరీక్ష రద్దు గుండెకోతను మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: