హీరో శ్రీకాంత్ ప్రస్తుతం దేవరాయ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దొరబాబు, శ్రీకృష్ణ దేవరాయలుగా శ్రీకాంత్ నటిస్తున్నాడు. త్వరలో విడుదల కు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఆడియోను బుధవారం సాయంత్రం విడుదల చేస్తున్నారు.
కాగా, శ్రీకాంత్ సినిమా కెరీర్ ను పరిశీలిస్తే మిగిలిన హీరోల కంటే అతను విభిన్నంగా కనిపిస్తాడు. 1991 లో వచ్చిన ‘ పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. తన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన శ్రీకాంత్ తరువాత విలన్ పాత్రలతోనూ మంచి గుర్తింపు సాధించాడు. తరువాత నెమ్మది నెమ్మదిగా హీరో పాత్రలు పోషించండం ప్రారంభించాడు. సింగిల్ హీరోగాను, ఇతర హీరోలతోనూ కలసి హీరోగా శ్రీకాంత్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
శ్రీకాంత్ సోలో హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అతనికి ఎన్నో అవకాశాలు తెచ్చి పెట్టింది. తరువాత కె.రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందడి సినిమా శ్రీకాంత్ ను హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది. వినోదం, ఎగిరే పావురమా, కన్యాదానం వంటి సినిమాలు హీరోగా శ్రీకాంత్ కెరీర్ గ్రాఫ్ పెరగడానికి దోహద పడ్డాయి.
అలాగే, సినిమాల గొప్పతనం తెలిసిన శ్రీకాంత్ తాను హీరోగా కొనసాగుతూనే ఇతర హీరోల సినిమాలలోనూ నటించడం మానుకోలేదు. ఈ విషయం శ్రీకాంత్ ను పరిశ్రమలో పెద్ద హీరోలకు దగ్గర చేసింది. నాగార్జున తో కలిసి నిన్నే ప్రేమిస్తా సినిమాలో నటించిన శ్రీకాంత్, వెంకటేష్ తో కలిసి సంక్రాంతి సినిమాలో నటించి, ప్రస్తుతం షాడో సినిమాలో నటిస్తున్నాడు. బాలకృష్ణ తో శ్రీరామరాజ్యం సినిమాలో నటించాడు. చిరంజీవితో కలిసి శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలలో నటించాడు. ఈ విధంగా సాగుతున్న శ్రీకాంత్ కెరీర్ ను పరిశీలిస్తే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన కెరీర్ ను మలుచుకోవడం ఒక్క శ్రీకాంత్ కే సాధ్యం అయిందనిపిస్తుంది.
ఇలా తెలివిగా సాగుతున్న శ్రీకాంత్ వంద సినిమాల మైలురాయిని దాటడం ఏమంత గొప్పగా అనిపించడం లేదు. శ్రీకాంత్ మరో వంద సినిమాలు పూర్తి చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి