తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన ధ్రువ తార...ప్రజలు మెచ్చిన నాయకుడు, నటుడు మన నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి కూడా, ఈరోజు ఆ మహానుభావుడి 25 వ వర్ధంతి సందర్భంగా అయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఆయన స్వర్గస్తులైన తరువాత నుండి ఇప్పటివరకు ఆయనను జూనియర్ ఎన్టీఆర్ లో చూసుకుంటున్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా ఉండేవారో...అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఉండడంతో ప్రజలు అతనిని నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు.

నటనలో, డైలాగ్ చెప్పడంలో ఆయన లాగే చేస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు. అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ కి పౌరాణిక పాత్రలతో ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా పౌరాణికంగా తాను చేయగలనని యమదొంగ సినిమాతో నిరూపించుకున్నాడు. విలన్ పాత్రలను కూడా పోషించిన చరిత్ర సీనియర్ ఎన్టీఆర్ ది. అందుకే జై లవకుశ సినిమాలో, జూనియర్ తనలోని విలనిజాన్ని కూడా చూపించి తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నారు. జనవరి 18న, సీనియర్ ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అప్పుడు నాకు పదకొండేళ్లు ఉంటాయి. మా అమ్మకు మా నాన్న ఫోన్ చేసి...తాతయ్య రమ్మన్నాడని చెప్పారు....అంతలో మా అమ్మ నన్ను రెడీ చేసుకుని తీసుకెళ్లింది. అప్పటివరకు ఆయన గురించి వినడమే కాని చూసింది లేదు.  తాతయ్య ఇంట్లో అడుగుపెట్టగానే నాకు ఏదో తెలియని ఉద్వేగం. అప్పుడు తాతయ్య కాషాయవస్త్రాల్లో ఉన్నారు. కింద నేలమీద కూర్చుని ఏవో గ్రంథాలు ముందేసుకుని కూర్చున్నారు. నన్ను చూసి రండి అని పిలిచారు.  ’మీ పేరేంటి‘ అని అడిగారు. ’తారకరామ్‘ అని చెప్పాను. నా పుట్టినరోజు గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు, నా చేతిని చూశారు. తరువాత నాన్నను పిలిచి ఇప్పటి నుండి వీడి పేరు నా పేరే పెడుతున్నా నందమూరి తారక రామారావు.

 అప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు తాతగారితోనే కలిసి ఉన్నానని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ తరువాత తాతయ్య అమ్మకు ఫోన్ చేసి పిలిచారు...ఇంతకాలం మనమంతా దూరంగా ఉన్నాం, వాటి గురించి మీరేమీ ఆలోచించొద్దు...నాకు నా వంశాంకురాన్ని ఇచ్చారు. నా అంతటివాడు అవుతాడు. మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను ఏమి చేయాలో అది చేస్తా అన్నారు. ఈ మాటలతో మా అమ్మ కళ్ళు కన్నీటి ధారలతో నిండి పోయాయి. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: