టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఉదయ శ్రీనివాస్ గవర.. అల్లు అర్జున్ కి ఒక మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే. వారిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే.. శ్రీనివాస్ తన పేరును "బన్నీ" గా మార్చుకున్నారు. బన్నీ అనేది అల్లు అర్జున్ నిక్ నేమ్ అని అందరికీ తెలిసిందే. ఐతే అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడైన బన్నీవాసు.. అల్లు అరవింద్ భాగస్వామ్యంతో జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. అయితే ఇటీవల అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు నిర్మాణంలో "చావు కబురు చల్లగా" సినిమాని దర్శకుడు కౌశిక్ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చిత్ర బృందం అనుకుంది కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో నిర్మాత బన్నీ వాస్ కి తీవ్ర నిరాశ ఎదురైంది.


బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్టయి.. మంచి లాభాలు తెచ్చి పెట్టాయి కానీ కార్తికేయ, లావణ్య నటించిన సినిమా మాత్రం నష్టాలనే మిగిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో హీరో కార్తికేయ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చావు కబురు చల్లగా సినిమా గురించి మర్చిపోండి.. ఇంకో అవకాశం ఇవ్వండి, తదుపరి సినిమాతో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తానని కార్తికేయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారంటే ఆ సినిమా వారిని ఎంతగా భయ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.



ఐతే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మళ్లీ కార్తికేయ తోనే మరో సినిమా చేయాలని జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ సిద్ధమైందట. బన్నీ వాసు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి కార్తికేయ హీరోగా ఒక సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతోందని కూడా తెలుస్తోంది. అయితే కార్తికేయ తో సినిమా తీసి చేతులు కాల్చుకున్న బన్నీవాసు మళ్లీ అతనితోనే సినిమా చేయడానికి ఒక కారణం ఉందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అదేంటంటే, అల్లు అరవింద్ కార్తికేయ తో ఒక హిట్ కొట్టాలని.. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా నిర్మాతకి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారట. దీంతో బన్నీ వాసు ధైర్యంగా కార్తికేయ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. ఏదేమైనా ఫ్లాపులతో సతమతమవుతున్న కార్తికేయ కు అల్లు అరవింద్ సపోర్ట్ గా నిలవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: