కలలో అయినా... కలయికలో అయినా కలిసుండని కాలాలైనా... నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ' అంటూ పాడుకుంది ఓ ప్రేమజంట.
మరి ఆ ప్రేమికుల ప్రయాణంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయో తెలియాలంటే 'అహింస' చూడాల్సిందే. నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. గీతిక కథానాయిక. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. ప్రచారంలో భాగంగా 'నీతోనే నీతోనే..' అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. ఆర్‌.పి.పట్నాయక్‌ స్వరకల్పనలో, చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సిద్‌శ్రీరామ్‌, సత్య యామిని ఆలపించారు. ''తేజ - ఆర్‌.పి.పట్నాయక్‌ - ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌... ఇలా విజయవంతమైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. తొలి పాటకి మంచి స్పందన లభిస్తోంద''ని తెలిపాయి సినీ వర్గాలు. సదా, కమల్‌ కామరాజు, రజత్‌ బేడీ, సాధా, రవికాలే, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవిప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంభాషణలు: అనిల్‌ అచ్చుగట్ల.
కన్నడ నుంచి గ్యాంగ్‌స్టర్‌ కథలు విరవిగా వస్తున్నాయి. 'కె.జి.ఎఫ్‌' సినిమాల తర్వాత, మరో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 'కబ్జా' తెరకెక్కుతోంది. ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రియశరణ్‌ కథానాయిక. సుదీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో అగ్ర కథానాయకుడు శివరాజ్‌ కుమార్‌ ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేస్తారు. ఇలా ముగ్గురు స్టార్‌ హీరోల కలయికలో... పాన్‌ ఇండియా చిత్రంగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌.చంద్రు దర్శకత్వంలో, ఆర్‌.చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ''1942 నేపథ్యంలో సాగే చిత్రమిది. ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేస్తారు. పీరియాడిక్‌ కథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా అవుతుంద''ని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవిబ్రసూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఎ.జె.శెట్టి ఛాయాగ్రాహకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: