
శ్రీదేవి మొదటి సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, శ్రీదేవికి వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె, తన అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ పెద్ద స్థాయి విజయాలు దక్కకపోవడంతో, తన కెరీర్‌ను వదిలి వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడింది. పెళ్లి తరువాత ఒక బిడ్డకు తల్లి అయినా, ఆమె అందంలో ఎలాంటి మార్పు రాకపోవడం విశేషం. అప్పుడప్పుడూ బుల్లితెర షోల్లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.
ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత శ్రీదేవి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది.
“సుందరకాండ” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నారా రోహిత్ హీరోగా నటిస్తుండగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా మారింది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ద్వారా సినిమా హైప్ పెంచుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి తన తొలి చిత్రం “ఈశ్వర్” గురించి ప్రస్తావిస్తూ, ప్రభాస్‌తో తన స్నేహాన్ని గుర్తుచేసుకుంది. “ఈశ్వర్ సినిమాతోనే నాకు, ప్రభాస్‌కి పరిచయం అయింది. అప్పటినుంచి మేము మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు. కానీ అతని మనసులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ చిన్నపిల్లాడిలా నవ్వుతూ, సరదాగా మాట్లాడుతుంటాడు” అని చెప్పుకొచ్చింది.