దర్శక ధీరుడు శంకర్ పేరు వింటే ఒకప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. 'జెంటిల్‌మేన్' నుంచి 'రోబో' వరకు ఆయన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా 2005లో రిలీజైన 'అపరిచితుడు'  సినిమా అవినీతి, లంచగొండితనంపై పోరాటం చేస్తూ సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో హీరో విక్రమ్ 'రాము', 'రెమో', 'అపరిచితుడు' అనే మూడు భిన్నమైన పాత్రల్లో జీవించారు. సదా కథానాయికగా మెరిసిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వివేక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అయితే, ఇటీవల కాలంలో శంకర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. 'స్నేహితుడు', 'రోబో 2.0', 'ఇండియన్ 2', 'గేమ్ ఛేంజర్' వంటి మూవీలు ప్రేక్షకులను కొంత నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, ఆయన గత బ్లాక్‌బస్టర్‌ల గురించి చర్చ మళ్లీ మొదలైంది.


విక్రమ్ చిన్ననాటి 'అంబి' - విరాజ్! 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తున్నాడా? అతని పేరు విరాజ్. అసలు పేరు హరి ప్రశాంత్. డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ హెచ్ఎన్ సురేందర్ ఆయన తండ్రి. 2000వ సంవత్సరంలో 'బీయిలే మిహాలో' అనే సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన విరాజ్.. 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ చిన్ననాటి 'అంబి' పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు. బాలనటుడిగా కాకుండా, ఆయన 'చెన్నై 600028' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇటీవల అరుణ్ విజయ్ నటించిన 'మిషన్ చాప్టర్ 1' లోనూ ఒక ముఖ్య పాత్రలో మెరిశాడు.



కోలీవుడ్ స్టార్ హీరోకు బావమరిది! .. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విరాజ్ మన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కి దగ్గర బంధువు. విరాజ్ తండ్రి సురేందర్ గారు.. విజయ్ తల్లి శోభనా చంద్రశేఖర్ గారికి సోదరుడు అవుతాడు. అంటే, ఆ లెక్కన విరాజ్.. నటుడు విజయ్‌కి బావమరిది అవుతాడన్నమాట. ప్రస్తుతం విజయ్ రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి సినిమా 'జననాయగన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా, ఒకప్పుడు శంకర్ బ్లాక్ బస్టర్ 'అపరిచితుడు'లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్, నేడు తమిళనాట స్టార్ హీరోకు అత్యంత దగ్గరి బంధువుగా ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: