మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఆయన సినిమాలు వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి “అల్లుడా మజాకా”. ఈ సినిమా ఒకానొక సమయంలో మహిళా సంఘాల ఆగ్రహానికి గురై, బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. అయినా చివరికి విజయాన్ని సాధించింది. 1995లో విడుదలైన ఈ సినిమాను ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటి లక్ష్మి, అలాగే కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురళి రాసిన స్టోరీకి, రాజ్-కోటి అందించిన మ్యూజిక్ అదనపు హైలైట్ అయ్యింది. ముఖ్యంగా “అల్లుడా మజాకా” టైటిల్ సాంగ్ అప్పట్లో మాస్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.


చిరంజీవి ఇందులో అల్లుడు సీతారాముడు పాత్రలో కనిపించారు. ఆయన మరియు అత్తగా నటించిన లక్ష్మి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను పగలబడి నవ్వించేలా చేశాయి. ఈ సినిమాకు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ అన్నీ కలగలిపి ఉన్నాయన్న మాట. కానీ సినిమా విడుదలైన రెండునెలల తర్వాత పెద్ద కలకలం రేగింది. కొన్ని సన్నివేశాలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కమ్యూనిస్టులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. అయితే చిరంజీవి అభిమానులు రోడ్లపైకి దిగి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి సినిమా పూర్తిగా బ్యాన్ కాకుండా, కొన్ని వివాదాస్పద సన్నివేశాలు మాత్రమే కత్తిరించారు.



వివాదాల మధ్య కూడా సినిమా మంచి బాక్సాఫీస్ రన్ కనబరిచింది. ఏకంగా 100 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇది అప్పట్లో మెగాస్టార్ మార్కెట్‌కి మరోసారి నిదర్శనమైంది. “అల్లుడా మజాకా”లో చిరంజీవి యాక్షన్, ఎనర్జీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” మరియు “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాల‌తో బిజీగా ఉన్నా, ఆయన గతంలోని ఈ తరహా వివాదాస్పద కానీ హిట్ సినిమాలు అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.


https://www.instagram.com/p/DN4sAxgE2IG/?utm_source=ig_web_copy_link


మరింత సమాచారం తెలుసుకోండి: