
- ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన వాళ్లతో బహిరంగ క్షమాపణ చెప్పించే దమ్ముందా?
- వెయ్యి కోట్లు ప్రజాధనంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?
- మూడు సార్లు కేంద్రంలో కీలకంగా ఉన్నా భారత రత్న ఎందుకు సాధించలేకపోయారు?
- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
ఎన్టీఆర్ పై నిజంగా ప్రేమ ఉంటే విగ్రహాలు పెట్టడం కాదని, దమ్ముంటే భారతరత్న సాధించాలని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ సవాల్ విసిరారు. అమరావతి ప్రాంతంలోని నీరుకొండపై ప్రజాధనంతో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్ధలంలో సొంత డబ్బులతో ఎన్టీ రామారావుకి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. అంతేగానీ వెయ్యి కోట్లు ప్రజా ధనాన్ని వెచ్చించి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే సంక్షేమ పధకాలకు నిధులు లేవని చెబుతున్న చంద్రబాబు నాయుడు... ఎన్టీ రామారావు విగ్రహానికి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయాలనుకోవడం దారుణమన్నారు. 2018లోనే నీరుకొండపై విగ్రహం ఏర్పాటు చేసేందుకు అప్పట్లోనే దాదాపు 400 కోట్లు అంచనాలు వేశారన్నారు. ఏడేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అప్పట్లోనే 400 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంగా చూపించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ అంచనాలను వెయ్యి కోట్లకు పైగా పెంచి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు విగ్రహం ప్రజాధనంతో కాకుండా పార్టీ నిధులతో ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ప్రభుత్వ భూమిలో... అది కూడా కొండ మీద ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిజంగా ఎన్టీ రామారావు మీద అభిమానం, ప్రేమ ఉంటే ఇప్పటి వరకు భారతరత్న ఎందుకు సాధించలేదన్నారు. మూడు సార్లు కేంద్రంలో కీలకంగా ఉన్నా ఎన్టీఆర్ కు భారతరత్న సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిల రోజున భారతరత్న అంటూ హడావుడి చేస్తారే తప్ప ఏనాడూ భారతరత్న కోసం ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. ముందు ఎన్టీ రామారావుకి భారతరత్న సాధించి తరువాత ప్రైవేటు స్థలాల్లో సొంత నిధులతో విగ్రహాలు పెట్టుకోండంటూ రామచంద్రయాదవ్ హితవు పలికారు.
అవసరం లేనప్పుడు చెప్పులు... రాజకీయాల కోసం విగ్రహాలా..
ఎన్టీ రామారావుని ఎవరు చెప్పులతో కొట్టించారో... ఆ చరిత్రను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు బోడె రామచంద్రయాదవ్. అవసరం లేనప్పుడు చెప్పులతో కొట్టి, రాజకీయాల కోసం విగ్రహాలు పెట్టడం సిగ్గుచేటన్నారు. అధికారం ఉంది కదా అని ప్రజా ధనంతో కొండల మీద విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాధనంతో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని చూస్తే బిసివై పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షిందన్నారు. నిజంగా ఎన్టీఆర్ పై గౌరవం ఉంటే ఆయన్ని చెప్పులతో కొట్టించిన వాళ్లతో బహిరంగ క్షమాపణ చెప్పించే దమ్ముందా? అని సవాల్ విసిరారు.