జగనన్న కొత్త స్కీమ్...అందరికీ! అదేంటి ఏ స్కీమ్ అయినా కొన్ని పరిమితులు బట్టే అమలు అవుతుంది కదా అని అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు అందరికీ వర్తిస్తున్న స్కీమ్ ఏంటి? అని అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూడవచ్చు. అయితే రాష్ట్రంలో అందరు ప్రజలకు సమానంగా అమలువుతున్న స్కీమ్ ‘జగనన్న గుంతల’ పథకం. ఇదే ఇప్పుడు ఏపీలో ఉన్న రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త సెటైర్.

వర్షాకాలం మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ రోడ్లకు భారీగా గుంతలు పడిపోయాయి. ఈ గుంతల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఏ రోడ్డుకు గుంతలు ఉంటే, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా పలు రోడ్లు దెబ్బతిన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీనిపై ప్రతిపక్ష టీడీపీ సెటైర్లు వేస్తుంది. జగనన్న పెట్టిన ఈ పథకంతో ప్రజలకు వణుకు వస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. జగనన్న గుంతల పథకానికి జనాలు భయపడుతున్నారని అంటున్నారు. అయితే టీడీపీ నేతలు ఎద్దేవా చేయడాన్ని పక్కనబెడితే, వర్షాలకు ఇటీవల రోడ్లకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వర్షాల దెబ్బకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ రోడ్లని ప్రభుత్వంగానీ, అధికారులు మరమ్మత్తులు చేయిస్తున్నట్లు కనిపించడం లేదు. అయినా వర్షాకాలం వస్తుందని తెలిసి కూడా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల రోడ్ల గురించి సోషల్ మీడియాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. తాజాగా దెందులూరు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న రోడ్లని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగు చేయించే కార్యక్రమం చేశారు. అటు మండపేట రోడ్డులో పడిన గుంతల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అటు పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గుంతల వద్ద చేపలు అమ్మారు. ఇలా పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల గురించి సెటైర్లు పేలుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: