ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ... అందరి దృష్టి మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావడంతో... అక్కడ అధికారం కోసం అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్మీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి కసరత్తు చేస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పొత్తు కుదుర్చుకున్నారు. ప్రస్తుతం యూపీ రాజకీయాలు కేవలం బీజేపీ, ఎస్‌పీ మధ్య మాత్రమే నడుస్తున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి పదవ తేదీన జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీకి ఆ పార్టీ నేతలు గట్టి షాక్ ఇస్తున్నారు. సరిగ్గా 48 గంటల్లోనే దాదాపు పది మంది కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

యోగీ ఆదిత్యానాఖ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సర్వే రిపోర్టులు కూడా వెల్లడించాయి. దీంతో ఆ కమలం పార్టీ నేతలు కూడా తమదే విషయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అధికారం మాట పక్కన పెడితే... గెలుస్తామో లేదో అనే అనుమానం కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. నేతలంతా పార్టీకీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేసిన నేతలంతా కూడా ఎస్‌పీ ఓటు బ్యాంకు అయిన బీసీలే కావడంతో... ఈ విషయం కాషాయ పార్టీకి ఎంత నష్టం చేస్తుందో... అంతకు రెట్టింపు స్థాయిలో అఖిలేష్ పార్టీకి లాభం చేస్తోందనేది రాజకీయ విమర్శకుల మాట. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు కమలం పార్టీకి రాజీనామా చేశారు. వీరి ప్రభావం రాష్ట్రంలో కనీసం 30కి పైగా నియోజకవర్గాల్లో స్పష్టంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా బీజేపీకి రాజీనామా చేసి అఖిలేష్ సారధ్యంలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాషాయా పార్టీ అగ్రనేతలు... ప్రస్తుత పరిస్థితులను సరి చేసేందుకు రంగంలోకి దిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: