గత మంత్రి వర్గంలో సీఎం జగన్ కి అండగా కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురూ లేకపోవడంతో వైరి వర్గాలను ఇరుకున పెట్టే బాధ్యత మిగతావారు తీసుకున్నారు. ఓవైపు అంబటి రాంబాబు ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకుంటున్నారు. మరోవైపు యువ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా ఆ స్థాయిలోనే చెలరేగిపోతున్నారు.

ఒంగోలులో సీఎం జగన్ పర్యటనకు సంబంధించి వెహికల్ ట్రయల్ రన్ కోసం ఓ కారుని బలవంతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై నేరుగా సీఎం కార్యాలయం సీరియస్ అవ్వడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఆర్టీఏ అధికారితోపాటు, హోం గార్డుపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు మొదలు పెట్టాయి. చంద్రబాబు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా అమ్మాయి కావాలంటే నేరుగా ఇళ్లలోకి వచ్చి మహిళలను ఎత్తుకెళ్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. దీనికి మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అమ్మాయిల గురించి మాట్లాడే చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్. చంద్ర‌బాబు ఉన్మాదిలా మారిపోయారని, బ‌రి తెగించి మాట్లాడుతున్నార‌ని అన్నారు అమర్ నాథ్. కేవలం చంద్రబాబునే కాదు, ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ విషయంలో కూడా అమర్ నాథ్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

గతంలో చంద్రబాబు కౌంటర్ ఇచ్చిన వెంటనే వైసీపీ తరపున కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుకు తలంటేవారు. ఇప్పుడు నాని స్థానంలో అమర్ నాథ్ వచ్చారని అంటున్నారు వైసీపీ నాయకులు. జగన్ కి అండగా నిలబడే విషయంలో అమర్ నాథ్ ముందుంటున్నారని చెబుతున్నారు. మొత్తమ్మీద కొత్త మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగారు. బాధ్యతల స్వీకరణతోపాటు, ప్రతిపక్షాలపై కూడా ఘాటుగా విమర్శలు ఎక్కు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: