ఎన్నికల నియమావళి అమలులో కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారుల్ని ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని, బ్యాలెట్ పేపర్ల ముద్రణలో తప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఇంచార్జ్ లకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ప్రవర్తనా నియామావళి అమలు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్థానిక సంస్థల వారీగా పంపిణీ, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, సున్నిత పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర విషయాలపై చర్చించిన ఈసీ.. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 

 

మునిసిపల్ ఎన్నికల కోసం రాష్ట్రంలో 7వేల పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. వార్డుకు కనిష్ఠంగా 2, గరిష్ఠంగా 4 వరకు కేంద్రాలు ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితా సిద్ధం చేసిన అధికారులు.. 13న అధికారికంగా వెల్లడించనున్నారు. ఒక్కో మునిసిపాలిటీలో కనిష్ఠంగా 10, గరిష్ఠంగా 49 వార్డుల వరకూ ఉన్నాయి. ఇక కార్పొరేషన్లలో కనిష్ఠంగా 22, గరిష్ఠంగా 60 డివిజన్లున్నాయి. వార్డులు, డివిజన్లలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరుగుతున్నందున ప్రతి కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా చూస్తున్నారు. 

 

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 120 మునిసిపాలిటీల పరిధిలో 2,727 వార్డులు, 10 కార్పొరేషన్ల పరిధిలో 385 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 53 లక్షలకుపైగా ఓటర్లు ఉండడంతో 7వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 25768 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాఖలైన 25,768 నామినేషన్లకు గాను 432 తిరస్కరణకు గురయ్యాయి. 25,336 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. సరైన నామినేషన్లు వచ్చిన వాటిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికంగా 8,956 కాంగ్రెస్ నుంచి 5365 అందాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు ఉంది. బి ఫారాలు, ఉపసంహరణ తరువాత ఏయే పార్టీ తరపున ఎంత మంది బరిలో ఉన్నారో స్పష్టత రానుంది.

 

ఇక రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లలో 66 నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయి. తొమ్మిది కార్పొరేషన్లలో 325 వార్డులకుగాను తిరస్కరణ తర్వాత 2,471 మంది మిగిలారు. మున్సిపాలిటీల్లో 366 తిరస్కరణ కు గురైన తరువాత టీఆర్ఎస్ నుంచి 8011, కాంగ్రెస్ 4848, బీజేపీ 3,523, ఎంఐఎం 363, సీపీఎం 260, party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ నుంచి 239 మంది మిగిలారు. 

 

జనవరి 14 ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల, జనవరి 22న పోలింగ్, 24న అవసరమైన చోట రీపోలింగ్, 25న ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మునిసిపల్ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: