కరోనా సమయంలో అన్ని రంగాల్లాగా మీడియా రంగం కూడా చాలా ప్రభావితమవుతోంది. ప్రత్యేకించి జర్నలిస్టులు ఇంటా బయటా నలిగిపోతున్నారు.. ఫీల్డులోకి వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందో తెలియదు. విధి నిర్వహణలో భాగంగా.. అన్ని చోట్లా తిరగాలి. అధికారులను కలవాలి. హాస్పటళ్లకు వెళ్లాలి.. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలి.. ఇలా అన్ని చోట్లా ప్రమాదం పొంచి ఉంది.

 

 

ఇవి విధులపరంగా ఉన్న ఇబ్బందులైతే.. ఇప్పుడు అసలు ఉద్యోగానికి సంబంధించి చాలా గడ్డుకాలం నడుస్తోంది. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తమ సమస్యలను విన్నవించింది. కరోనా విపత్తు నేపథ్యంలో జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో కోరారు.

 

 

ఈ ఆపద కాలంలో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి నెలకు రూ.10వేల ఆర్థికసాయం అందజేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ నేతలు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను కోరారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ తెలంగాణ సీఎస్ కు వినతి పత్రం అందించారు.

 

 

వినతి పత్రాన్ని పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖా కమిషనర్ అరవింద్ కుమార్ ను ఆదేశించారని జర్నలిస్టు నేతలు చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకూ అమల్లోకి వస్తుందో చూడాలి. అయితే జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోమని అడగటం వరకూ బాగానే ఉంది. కానీ ఉద్యోగాలు తీసేస్తున్న యాజమాన్యాల గురించి ఈ జర్నలిస్టు సంఘాలు మాత్రం నోరు విప్పడం లేదు.

 

 

ఇప్పటికే ఆంధ్రజ్యోతి సంస్థ... కొందరు ఉద్యోగులను తొలగించింది. ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది. మరికొన్ని సంస్థలూ ఇదే బాటపట్టే ఆలోచనలో ఉన్నాయి. ప్రింట్ మీడియాలో జిల్లా ఎడిషన్లు ఎత్తివేయడం వల్ల ఆమేరకు సిబ్బందిని సెలవులపై పంపారు. వారి ఉద్యోగాల కొనసాగింపుపై ఆందోళన ఉంది. కానీ జర్నలిస్టు సంఘాలు ఇవేవీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: