కరోనా కట్టడిలో తొలి అడుగు పడింది.  రీసెర్చ్ ల్యాబ్ లో విజయవంతంగా కృత్రిమ వైరస్ ను ఉత్పత్తి చేసి.. వ్యాక్సిన్‌ తయారీలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని సీసీఎంబీ. కరోనా వ్యాక్సిన్, ఔషధాల తయారీ, వైరస్‌ను నిర్వీర్యం చేసే చాలా పద్దతుల్లో ఈ వైరస్ శాంపిల్స్ కీలకంగా ఉపయోగపడనున్నాయి.


నెలన్నరకు పైగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. సీఎస్‌ఐఆర్‌, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంయుక్తంగా ... కొవిడ్‌ -19కు కారణమైన వైరస్‌ 'సార్స్‌ కోవ్‌-2' కల్చర్‌ను నిర్ధారించాయి. రోగుల నుంచి సేకరించిన నమూనాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైరస్‌ నమూనాల నుంచి రోగకారక వైరస్‌ను వేరుచేసిన పరిశోధకుల బృందం..  వైరస్‌ను ల్యాబ్‌లో కల్చర్‌ చేయగల సామర్థ్యం.. ఇటు వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి, అటు కరోనాను అరికట్టగల ఔషధ పరీక్షలకు ఉపయోగపడుతుందని ప్రకటించింది. 

 

సీపీఎంబీ పరిశోధకుల బృందం రూపొందించిన వైరస్‌ కల్చర్‌ ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతిరోధకాలను తెలుసుకొని పరీక్షించవచ్చనీ... క్రిమిసంహారకాల సామర్థ్యాన్ని కూడా పరీక్షించవచ్చని చెప్పారు. అల్ట్రావయొలెట్‌ పరికరాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి కూడా వైరస్‌ కల్చర్‌ అవసరమని వివరించారు.

 

సాధారణంగా ఒక నిర్దిష్ట వ్యాధికారక సూక్ష్మజీవి నుంచి రూపొందినవే వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిలో రోగనిరోధక స్పందనను ప్రేరేపించి ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. పోలియో వ్యాధి కట్టడికి కూడా మృతవైరస్‌నే వ్యాక్సిన్‌గా వాడారు.

 

ఎందుకంటే నిర్వీర్యమైపోయిన వైరస్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ సోకదు. పైగా వాటి ప్రొటీన్లు కణాలలో ప్రతిరోధకాల తయారీని ప్రేరేపిస్తాయి. నిర్వీర్యం చేయబడిన సార్స్‌-కోవ్‌2 ఎంత సమర్థంగా వ్యాక్సిన్‌కు పనికొస్తుందనే దానిపై ప్రస్తుతం అనేక బృందాలు పరిశోధిస్తున్నాయి.మొత్తానికి కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రయోగాలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: