ఇప్పుడిప్పుడే ఆటలు మొదలవుతున్నాయి. ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు..మళ్లీ గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. టెన్నీస్ స్టార్‌ నొవాక్ జొకోవిచ్‌ ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్ టోర్నీలో నిర్వహించాడు. అదే అతడికి శాపంగా మారింది. ఆ ఒక్క టోర్నీతో అతడితో పాటు వరల్డ్ టాప్‌ ఆటగాళ్లకు కరోనా సోకింది.

 

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌కు కరోనా సోకింది. తనకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించాడు. కరోనా పరీక్షలు చేయించుకున్నామని, తనకు, తన భార్య జెలెనా రిస్టిక్‌కు పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు జకోవిచ్. అయితే ఆయన పిల్లలకు మాత్రం నెగిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ రావడంతో 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోనున్నారు జకోవిచ్‌ దంపతులు. 

 

ఇటీవల సెర్బియా, క్రొయేషియాలో టెన్నిస్‌ ఎగ్జిబిషన్‌ సిరీస్‌లో నిర్వహించారు. ఇందులో జకోవిచ్ సహా టాప్‌ ఆటగాళ్లు పాల్గొన్నారు. బోర్నా కోరిచ్‌తో మ్యాచ్‌లో ఓడిన తర్వాత జ్వరంగా ఉండడంతో దిమిత్రోవ్‌ అర్థంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. పరీక్ష చేయించుకోగా.. అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో తాను చికిత్స చేయించుకుంటున్నానని, తనతో ఆడిన వాళ్లు కూడా టెస్టులు చేయించుకోండి.. తన వల్ల వైరస్ మీకు సోకితే క్షమించండి అంటూ దిమిత్రోవ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

 

దిమిత్రోవ్‌తో సింగిల్స్‌ మ్యాచ్‌లో తలపడ్డ క్రొయేషియాకు చెందిన 23 ఏళ్ల బోర్నా కోరిచ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా.. టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఇదే టోర్నీకి హాజరైన జొకోవిచ్‌, అతని భార్య, ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కో పానిచితో పాటు దిమిత్రోవ్‌ కోచ్‌ క్రిస్టియాన్‌ గ్రో కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. జకోవిచ్, ప్రపంచ 19వ ర్యాంకర్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌, 33వ ర్యాంకర్‌ బోర్నా కోరిచ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇలా ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆడ్రియా టూర్‌ రెండో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దయింది. 

 

ఆడ్రియా టూర్‌లో పోటీపడ్డ టాప్‌ ఆటగాళ్లకు కరోనా రావడంతో ఈవెంట్‌ నిర్వాహకుడైన నొవాక్‌ జొకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్‌ ఓపెన్‌లో ఎలా ఆడతామంటూ ఇప్పటిదాకా ప్రశ్నించిన అతను.. అంతకంటే ముందే ఆడ్రియా ఈవెంట్‌ను నిర్వహించడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ టోర్నీలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. ఈ టోర్నీని తిలకించేందుకు వచ్చిన సుమారు నాలుగువేలకు పైగా ప్రేక్షకుల్లో చాలావరకూ మాస్క్‌లు ధరించలేదు. అంతేకాదు.. మ్యాచ్‌లకు ముందు బాస్కెట్‌బాల్‌ ఆడిన జొకోవిచ్‌, దిమిత్రోవ్‌, సిలిచ్‌, కోరిచ్‌, జ్వెరెవ్‌ సెలబ్రేషన్స్‌లో కౌగిలింతలు, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకొని భౌతికదూరం నిబంధనలను గాలికొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా, ఆటగాళ్లంతా కలిసి రాత్రిపూట నైట్‌క్లబ్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం వివాదాస్పదమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: