అమెరికా అధ్యక్ష పదవికోసం డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్ పోటాపోటీగా తలపడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎన్నికలను రసవత్తరంగా మార్చేస్తున్నారు. నాలుగేళ్లలో అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టానని ట్రంప్ చెబుతున్నారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని.. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడంలో సక్సెస్ అయ్యామని చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు.
డెమొక్రటిక్ పార్టీ నేత జోబైడెన్ అంశాలవారీగా ప్రచారం చేస్తున్నారు. అమెరికన్ వీసాల ప్రక్రియను సరళతరం చేస్తామన్నారు బైడెన్. దేశాలవారీ వీసాల జారీ విధానానికి స్వస్తి పలుకుతామని ప్రకటించారు. కుటుంబ ఆధారిత వలస విధానాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వాస్తవానికి వీసాల విషయంలో ట్రంప్ కఠిన వైఖరి అవలంబించారు. విదేశీయుల వల్ల అమెరికన్లు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారంటూ ట్రంప్ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేశారు. అమెరికాలో పనిచేయాలనే ఇండియన్స్ లాంటివాళ్లకు ట్రంప్ నిర్ణయం ఇబ్బందిగా మారింది. దీన్ని గమనించిన జోబైడెన్ వీసాలను సరళతరం చేస్తామని చెప్పారు. బైడెన్ నిర్ణయంపై ఇండియన్స్ సంతోషిస్తున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బైడెన్-హ్యారిస్ ద్వయం ఓ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. హిందూ ఇండియన్-అమెరికన్స్ కోసం ప్రత్యేకంగా డాక్యుమెంట్‌ను రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. ఇందులో భారతీయ అమెరికన్లకోసం పలు వరాలు ప్రకటించారు. అయితే అంతకుముందు ముస్లింలకోసం కోసం కూడా వీళ్లు ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అందులో కాశ్మీర్ అంశాన్ని కూడా చేర్చారు. దీనిపై పలువురు భారతీయ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బైడెన్‌కు ఇబ్బందిగా మారింది.
వీసాల విషయంలో కాస్త కఠినంగా ఉన్నా.. మిగిలిన అన్నింటిలో ట్రంప్ భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాశ్మీర్ అంశంపై ట్రంప్ చాలాసార్లు మౌనం వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహం.. ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. కానీ డెమోక్రాట్లు మాత్రం పలు సందర్భాల్లో కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది బైడెన్ కు ఇబ్బందిగా మారుతోంది.
ఇండో అమెరికన్ల మద్దతు కోసమే కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి జోబైడెన్ ఎంపిక చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. ఇండో అమెరికన్ల మద్దతుకోసం బైడెన్ వేసిన అద్భుతమైన ఎత్తుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బైడెన్‌తో పోల్చితే తనవైపే ఎక్కువమంది ఇండియన్లు ఉన్నారని ట్రంప్ చెప్తున్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో ఇండియన్స్ ఎవరికి మద్దతిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి