సామాన్యుడికి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పాడు.. అవును మరి.. సగటు మానవుడి వంటింట్లోకి ఉల్లిపాయ కొనడం కూడా గగనమైపోతోంది. మానవుడి నిత్యావసరమైన ఉల్లిపాయ కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. అసలే కొరత, ఆ పై వరదలు.. సరఫరా తక్కువ.. డిమాండ్ ఎక్కువ.. దీనికితోడు బ్లాక్ మార్కెట్లు.. అందుకే.. మార్కెట్లో ఉల్లి రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధిక వర్షాలు పడడంతో ఉల్లి పంటలు నీట మునిగిపోయాయి. దీంతో ఉల్లి ధరలకు రెక్కలెచ్చాయి. కిలో ఉల్లిగడ్డ ఏకంగా రూ. 80 నుంచి 110 పలుకుతోంది.

ఈ రేటు చూసి సామాన్యుడు ఉల్లి కొనకుండానే.. ఉల్లిపాయ లేకుండానే కూరలు వండేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు జగన్ సర్కారు ఈ విషయంపై స్పందించింది. జనం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో  రేపటి నుంచి అంటే.. శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు అమ్మబోతున్నారు.  

వారం రోజుల నుంచి ఉల్లిధర అమాంతం పెరిగిపోయింది. తాజా రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. అంతే కాదు.. ఇంకా ఈ ధర పెరుగుతుందని వార్తలు వస్తుండటంతో రేట్లు పెరుగుతున్నాయి. అందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేస్తోంది. వాటిని రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఏపీ సర్కారు కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది.

సదరు మార్కెట్‌లలో ప్రభు‌త్వం ఎంతకు కొన్నా... రైతు బజార్లలో మాత్రం  కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండో దశలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న చెబుతున్నారు. సర్కారు సబ్సిడీ ఉల్లి అమ్మబోతున్నారని తెలుసుకున్న జనం కాస్త ఊరట చెందుతున్నారు. ఎలాగైనా ఓ రెండు, మూడు కేజీలు కొనుక్కోవాలని డిసైడ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: