వచ్చే నెల 1నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 9వ తరగతి ఆ పై క్లాస్ ల విద్యార్థులు ఫిజికల్ గా హాజరు కానున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత శాఖలు, అధికార వర్గాలతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి విద్యాసంస్థలు ప్రారంభించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ట్యూషన్ ఫీజు  మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల ఇష్యూ ఉండొద్దనే పరీక్షలకు...హాజరు శాతం నిబంధనను తొలగించామన్నారు.

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో బోధనకు ఇబ్బందులు రాకపోవచ్చు కానీ జూనియర్ కళాశాలల్లో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోవిడ్ నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహించాలంటే ప్రస్తుతం ఉన్న బిల్డింగ్స్ సరిపోవనే వాదనలు వినిపిస్తున్నాయి. స్కూల్స్ లో 9, 10 తరగతులు మాత్రమే ప్రారంభం అవుతున్నాయి.. మిగతా తరగతులకు సంబంధించిన గదులు ఖాళీగా ఉంటాయి.. టీచర్స్ కూడా ఖాళీగా ఉంటారు.. ఆ తరగతి గదులను,  ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు..తరగతి గదికి 20 మంది విద్యార్థులు ఉన్నా ఇబ్బంది రాదు.

అదే జూనియర్ కళాశాలల విషయానికి వస్తే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలు ప్రారంభం అవుతాయి... ఇంటర్ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం తరగతి గదికి 30 మందికన్నా ఎక్కువ ఉండరాదు. ఎక్కువ ఉంటే రెండు షిఫ్ట్ లు నిర్వహించాలి. తెలంగాణ లో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే అందులో 232 కళాశాలల్లో 300 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నారు.. అలాంటి చోట్ల ఎన్ని షిఫ్ట్ లు నిర్వహించాలి ఎంత మాన్ పవర్ కావాలి, ఎన్ని తరగతి గదులు కావాలి అనే ప్రశ్న వస్తోంది.

రాష్ట్రంలో 48 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉంటే 12 కళాశాలల్లో 300 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 1278 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉంటే 704 కళాశాలల్లో 300 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలు అయితే కిక్కిరిసి ఉంటాయి. ఆ కళాశాలల్లో కోవిడ్ నిబంధన లు పాటిస్తూ నిర్వహించడం ఏ మేరకు సాధ్యం అనే సందేహం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: