టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారు దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పార్టీలో రోజురోజుకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే కీలక  నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆయన సంకేతాలు కూడా ఇస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పుకార్లు ఒకటే గుప్పుమంటున్నాయి. ఆయన ఓ మాజీ ఎంపీ గా జిల్లాలో తన క్యాడర్ ను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తనకే పదవి లేకపోవడంతో ఆయన తన అనుచరులకు మాత్రం ఏం పదవి ఇప్పించు కుంటారని కొందరు సెటైర్లు వేస్తున్నారు .

ఇక పొంగులేటి 2014లో రాష్ట్ర విభజన సమయంలో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన కొద్దిరోజులకే కారెక్కేసారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్పటికీ 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా టిడిపి నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చిన నామా నాగేశ్వరరావు కు సీటు ఇచ్చింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ అయిపోయారు. అయితే తనకు రాజ్యసభ సీటు వస్తుందన్న ఆశతో ఆయన ఉన్నారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కెసిఆర్ పొంగులేటి ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో అప్పట్లో కొందరు టిఆర్ఎస్ పార్టీ నేతల ఓటమికి పొంగులేటి కారణమయ్యారన్న ఫిర్యాదులు కెసిఆర్ వద్దకు వెళ్లడంతో కెసిఆర్ ఆయనను పక్కన పెట్టేశారని అంటున్నారు. ఇక ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందన్న ఆశలు ఉన్నా దక్కలేదు. దీంతో ఆయన రాజకీయ రేసులో వెనకబడి పోయారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలు,మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లైట్ గా తీసుకుంటున్నారు. ఒక ఎంపీ నామా తో పాటు మంత్రి పువ్వాడ సైతం పొంగులేటి వర్గానికి చిన్న పదవి కూడా  రాకుండా చేస్తున్నారు. దీంతో ఆయన కొద్దిరోజులుగా తన అనుచరులతో సమావేశమవుతున్నారు.చివరగా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: