
ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాల గురించి సీఎం జగన్ అధికారులతో చర్చించారు. నేరడి నిర్మాణానికి జగన్ రెడీ అయ్యారు. ఇందు కోసం ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. జల వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇవాళ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతున్నారు. జగన్, నవీన్ పట్నాయక్ మధ్య చర్చలు ఫలవంతమైతే.. నేరడి నిర్మితమైతే.. అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుందంటున్నారు నిపుణులు.
అలాగే.. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ పనులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉందని అంచనా. అటు నేరడి బ్యారేజీ నిర్మాణంపై కూడా జగన్ దృష్టి పెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే నేరడి బ్యారేజీ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కోసం జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరతారు.. సా. 5 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించుకుంటారని తెలుస్తోంది. ఒడిశా సీఎం నవీన్ తో చర్చల తర్వాత సీఎం జగన్.. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలదేరతారు. జగన్ మళ్లీ రాత్రి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.