ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని దేశాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. కరోనా భయాల నేపథ్యంలో చాలా చోట్ల సందడి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఎప్పటిలాగే ఆ దేశం ప్రపంచంలో మొదటిగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ప్రతి ఏడాదీ ప్రపంచంలో తొలిగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేది ఆ దేశమే. ఇప్పుడు కూడా అక్కడే కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా మొదలై, అంతకంటే ఘనంగా ముగిశాయి.

2022కి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికంటే ముందు కొత్తసంవత్సరాన్ని పరిచయం చేసుకుంది. ప్రపంచంలో సూర్యుడు తొలిగా అక్కడే ఉదయిస్తాడు కాబట్టి.. అక్కడినుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మనమంతా డిసెంబర్ 31లో ఉండగానే.. వారికి జనవరి 1 వచ్చేసింది. వారి క్యాలెండర్ మారింది, గడియారంలో టైమ్ ముందుకెళ్లింది. అందుకే అక్కడ కొత్త ఏడాది వేడుకలు అందరికంటే ముందే జరిగాయి.

పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా దీవితోపాటు టోంగా, కిరిబాటి దీవులు, న్యూజిలాండ్ వాసులు కూడా అందరికంటే ముందే కొత్త ఏడాది పండగ చేసుకుంటారు. ఈ ఏడీది కూడా అక్కడ కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. న్యూజిలాండ్ లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు సందడిగా సాగాయి. బాణసంచా వెలుగులతో అక్కడ వినీలాకాశం వెలిగిపోయింది. ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద ప్రతి ఏడాదీ కొత్త సంవత్సరం సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు జరుగుతాయి. ఈ సారి కూడా కరోనా భయాలను అధిగమించి ప్రజలు అక్కడ గుమికూడారు. ఇతర దేశాల్లో కొవిడ్ ఆంక్షలతో వేడుకల స్థాయి కాస్త తగ్గినా.. న్యూజిలాండ్ సహా పసిఫిక్ ద్వీపాల్లో సందడి మాత్రం తగ్గలేదు.

కొత్త ఏడాదికి ఎవరు ఎప్పుడు స్వాగతం పలికినా.. ఏడాదంతా ఆ సంబరం తమ జీవితాల్లో మిగిలి ఉండాలని కోరుకుంటారు. ఇటు భారత్ లో కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్ ఆంక్షలతో చాలా నగరాలు, పట్టణాల్లో మునుపటి సందడి కనిపించకపోయినా.. యువత మాత్రం నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: