తెలంగాణ రాజకీయాల్లో తమ కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న అతి తక్కువ మంది నేతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారు మూల గ్రామంలో పుట్టిన ఆయన.. ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండక్ లేకుండానే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. జడ్పీటీసీగా మొదలైన ఆయన ప్రయాణం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ సీఎం తో పాటు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ లో ఒక పదవి రావడమే గగనం. అలాంటిది ఏకకాలంలో రాష్ట్రంలో రెండు అత్యున్నత పదవులు చేపట్టడం ఆయనకు మాత్రమే చెల్లింది.  సహజంగా కాంగ్రెస్ లో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది. కానీ మాట్లాడటానికే పరిమితం.  కానీ రేవంత్ రెడ్డి కి వచ్చిన స్వేచ్ఛ వేరు. పార్టీలో తన మాటకు తిరుగులేకుండా చేసుకోగలిగారు. పార్టీపై పట్టును సాధించుకోగలిగారు.

ఈ విషయంలో అధిష్ఠానం నుంచి అండదండలను పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అయిన ఆయన.. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఆయనే అనే తరహాలో ప్రచారం సాగింది. మరే సీనియర్ నేతలు కూడా రాష్ట్రాన్ని చుట్టి రాలేదు. రేవంత్ మాత్రం అన్ని ఎంపీ స్థానాల్లో ప్రచారం చేసి స్థానిక నేతలతో మాట్లాడి పార్టీపై పట్టును నిలుపుకొన్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే..అధిష్ఠానం చెప్పి నట్లు కాకుండా.. అధినాయకత్వమే తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. అయితే తెలంగాణలో తనకు తిరుగులేదు అని నిరూపించాలంటే కచ్ఛితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధించాలి. ఒకవేళ ఏడు అంతకు మించి తక్కువ సంఖ్యలో సీట్లు వస్తే మాత్రం రేవంత్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైతే.. ఆయనపై కత్తి కట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కాకపోతే అధిష్ఠానం దగ్గర ఆయనకు మంచి పేరు ఉండటం అడ్వాంటేజ్ అయినా.. సీనియర్లను తట్టుకొని నిలబడటం తలకు మించిన భారమే అవుతుంది. అదే పదికి పైగా సీట్లు సాధిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి తిరుగుండదు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: