- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ప్రతి నియోజకవర్గానికి తనదైన చరిత్ర, సమస్యలు, విశిష్టతలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కొరతతో వెనుకబడుతుంటే, మరికొన్ని రాజకీయంగా కల్లోలంగా మారుతుంటాయి. అయితే ఏ నియోజకవర్గం అయినా అభివృద్ధి జ‌రిగిన‌ప్పుడే దానికి క్రేజ్ ఉంటుంది. ఈ కోణంలో గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజకవర్గం ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో అభివృద్ధి ప్రగతి దిశగా సాగుతోంది. “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన అనుచరులు, కీలక నాయకులు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మంత్రి తాను బిజీగా ఉన్నా ఈ కార్యక్రమంతో ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ చేస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని త‌క్ష‌ణ ప‌రిష్కారం అయ్యేలా చేస్తున్నారు. గతంలో మంగ‌ళ‌గిరిలో రాజకీయంగా తీవ్ర విభేదాలు, ఘర్షణలు కనిపించేవి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధాలు న‌డిచేవి. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో కూడా ఇక్క‌డ అభివృద్ధి లేదు. అయితే ఇప్పుడు రాజకీయంగా మంగ‌ళ‌గిరి ఒక ప్రశాంత వాతావరణం దిశగా ప్రయాణిస్తోంది.


లోకేష్ నేతృత్వంలో మంగ‌ళ‌గిరి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా దిగువ ప్రాంతాలకు పక్కా రహదారులు, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి వేగంగా జ‌రుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీరు అందించేందుకు పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. ఇవ‌న్నీ ప్రజల జీవన ప్రమాణాలపై చూపుతోంది. ఉపాధి అవకాశాల కల్పన బాగా జ‌రుగుతోంది. నారా లోకేష్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన రంగం చేనేత. ఈ రంగానికి విశేష ప్రోత్సాహం అందిస్తూ, మార్కెట్ లింకేజ్లు కల్పించ‌డంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే విధంగా ఇతర చిన్నతరహా చేతి వృత్తులకు కూడా అవసరమైన మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి దొరికేలా మార్పులు తీసుకువచ్చారు.


వీటితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని తేలింది. విద్య, ఆరోగ్య సేవలు, ఆధునిక సదుపాయాలు కొంత మేరకు అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలలో విశ్వాసం పెరుగుతోంది. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిన పార్టీ నాయకులకు వినిపించిన అభిప్రాయాలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు. వచ్చే నాలుగేళ్లలో మంగ‌ళ‌గిరి నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి మార్గంలోకి వచ్చేస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నాలుగేళ్లు లోకేష్ మంగ‌ళ‌గిరి అభివృద్ధిని ఇలాగే కొన‌సాగిస్తే త‌ర్వాత ఎన్నిక‌ల‌లోనూ మంగ‌ళ‌గిరిని లోకేష్ త‌న కంచుకోట‌గా మార్చుకుని రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: