
తాజాగా అమరావతిలో బసవతారకం ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అభిమానుల నినాదాలకు స్పందిస్తూ, "ఒక్క హిందూపురమేంటి? ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేస్తే గెలుస్తా" అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలతో వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి పోటీ చేయరా ? అన్న కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఇక హిందూపురంలో బాలయ్య తరఫున ఎక్కువగా ఆయన సతీమణి వసుంధర పర్యటిస్తున్నారు. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, పలు ప్రారంభోత్సవాల్లో ఆమె పాల్గొనడం, ప్రజలతో మమేకం కావడం గమనార్హం. దీంతో, వచ్చే ఎన్నికల్లో వసుంధర హిందూపురం అభ్యర్థిగా వస్తారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
మరోవైపు, బాలయ్య వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ పోటీలో అడుగుపెడతారని కూడా సమాచారం. ఇటీవల ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమావేశమైనప్పుడు, "ఈసారి నేను కూడా పార్లమెంట్‌కి వస్తాను" అన్న కోరికను వ్యక్తపరిచారని అంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఏపీలో మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కుటుంబ, సామాజిక సమీకరణల కారణంగా కూడా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రూటు మార్చాలని ఆలోచిస్తున్నారా ? అన్నది చర్చనీయాంశమైంది. బాలయ్య ఎంపీగా గెలిస్తే, ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ కోటాలో కేంద్ర మంత్రిగా అవకాశం రావచ్చనే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు 70 ఏళ్ల వయసుకు చేరువ అవుతారు. సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పకపోయినా, కొంత తగ్గించి అధికార బాధ్యతలపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం సులభం కావచ్చని కూడా అనుకుంటున్నారు.