
కొందరు కాలువలు, చెరువులు, నదులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే, ఆ ప్రదేశాలు పరిశుభ్రంగా లేకపోతే, విగ్రహాలు, పూజా సామాగ్రి మరింత కాలుష్యానికి కారణమవుతాయి. నిమజ్జనం కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశాలను ఉపయోగించడం ఉత్తమం. వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లే సమయంలో దారిలో పూలు, పండ్లు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను పడేయడం మంచిది కాదు. ఇది అపవిత్రంగా భావించబడుతుంది. పూజా సామాగ్రిని తగిన విధంగా పారవేయాలి లేదా పర్యావరణానికి హానికలగని విధంగా జాగ్రత్తపడాలి.
విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తరువాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోవడం మరో పెద్ద తప్పు. నిమజ్జనం జరిగిన తరువాత ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. వినాయక నిమజ్జనం ఒక ఆధ్యాత్మిక వేడుక. ఈ సమయంలో మద్యం సేవించడం, అనుచితంగా ప్రవర్తించడం, గొడవలు పడటం వంటివి దైవానికి అపచారం. భక్తితో, శాంతియుతంగా ఈ వేడుకలో పాల్గొనాలి.
ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. నిమజ్జనం కోసం అనుమతించబడిన సమయాన్ని, మార్గాలను పాటించాలి. డీజే సౌండ్స్ వంటి అధిక శబ్దాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ విధంగా, వినాయక నిమజ్జనాన్ని భక్తితో, పర్యావరణానికి హానికలగకుండా, సామాజిక బాధ్యతతో జరుపుకోవడం ద్వారా మన పండుగ మరింత పవిత్రంగా, అందంగా మారుతుంది. పది రోజుల పాటు ఆనందంగా పూజలు చేసిన మనం, గణపతిని అదే పవిత్రతతో సాగనంపాలి.