ఆధునిక ప్రపంచంలో ఉద్యోగుల్లో చాలామందికి, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఇతర కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి ఎక్కువ సమయం కూర్చొనే ఉంటారు. ఇది రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఈ అలవాటు మన శరీరం, మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనం ఆలోచించం. కూర్చోవడం అవసరమే కానీ, అది మితిమీరినప్పుడు అనేక సమస్యలకు కారణమవుతుంది.

 మనం ఎక్కువసేపు కూర్చుంటే, మన శరీరం కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి బరువు పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చుంటే వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వెన్నునొప్పి, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

శరీరం కదలకుండా ఉండటం వల్ల కీళ్ళు బిగుసుకుపోతాయి. దీంతో కీళ్ల నొప్పి, నడకలో ఇబ్బందులు వస్తాయి.  కూర్చోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసేపు కూర్చుంటే కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో రక్త గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

నిరంతరం కూర్చొని ఉండటం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరుగుతాయి. శరీరం కదలకుండా ఉంటే మెదడు చురుకుదనం తగ్గి ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. సరిగా కదలకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ప్రతి గంటకు ఐదు నిమిషాలు కూర్చున్న చోటు నుండి లేచి నడవడం, చేతులు, కాళ్లు స్ట్రెచ్ చేయడం వంటివి చేయాలి. వీలైతే నిలబడి పనిచేయడానికి స్టాండింగ్ డెస్క్ ఉపయోగించవచ్చు. నడుస్తున్నప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు చిన్నపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: