తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నుంచి తాను సస్పెండ్ చేయబడిన విషయంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అసలు ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతోంది, భవిష్యత్తులో ఏమి జరగబోతోంది అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ.."పలు నిజాలను బయటపెట్టడమే కాకుండా, బీఆర్‌ఎస్ పార్టీలో ఇన్ని రోజులు ఏం జరిగింది..?పార్టీ బలహీన పడడానికి కారణం ఎవరు..? పార్టీని నమ్మించి ముంచేసింది ఎవరు..? వంటి విషయాలను వెల్లడించారు. "జై తెలంగాణ" నినాదంతో ప్రెస్ మీట్‌ను ప్రారంభించిన కవిత, సస్పెన్షన్ లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల గురించి మాత్రమే మాట్లాడతానని స్పష్టం చేశారు.


కవిత మాట్లాడుతూ.. "నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలులో ఐదు నెలలు ఉంచారు. అప్పుడు నాకు పెద్దగా బాధ అనిపించలేదు. బయటకు రాగానే 2024 నవంబర్ 23వ తేదీ నుంచి ప్రజల మధ్య తిరుగుతున్నాను, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. కానీ నాపై కావాలని కుట్ర చేసి నన్ను చెడుగా చిత్రీకరిస్తున్నారు. 10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాలలో పర్యటించిన నన్ను ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా  పార్టీ కోసం పరుగులు పెట్టాను.. నేను పడ్డ కష్టం ప్రతి ఒక్కరికి  తెలుసు. కానీ నన్ను ఈ రోజు ఒంటరి చేశారు. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో కొందరు నాపై కక్ష కట్టి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేస్తున్నారు.



సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్న నేను తప్పుగా ఏమి మాట్లాడలేదు, ఏమి తప్పుగా ప్రవర్తించలేదు, ఏమి తప్పు చేయలేదు. సామాజిక తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ కి వ్యతిరేకం ఎలా అవుతుంది?" అంటూ ప్రశ్నించారు కవిత. అంతేకాదు, "కేసీఆర్‌గారిని గడ్డం పట్టుకుని అడుగుతున్నాను. నా మీద కుట్రలు జరుగుతున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏమి చేశారు? నాపై జరుగుతున్న కుట్రల గురించి కేటీఆర్‌కు చెప్పినా, ఆయన నుంచి ఫోన్ కూడా రాలేదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మహిళా నేతలు కూర్చొని నాపై ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అది మంచిదే, నేను కోరుకున్నదే. కానీ కొందరు కావాలని నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, పార్టీని అస్తవ్యస్తం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఈ రోజు నేను, రేపు కేటీఆర్‌.. ఇదే గతి వస్తుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



కవిత మాట్లాడుతూ మహిళా నేతల ప్రెస్ మీట్ ప్రస్తావన చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. రాజకీయ విశ్లేషకులు కవితను సస్పెండ్ చేయించింది ఒక మహిళా నేతేనని అంటున్నారు. అంతేకాదు, ఆ మహిళా నేత ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో ప్రజలు విస్తృతంగా స్పందిస్తున్నారు. బీఆరెస్ పార్టీకి ఆ లేడీనే కిలాడి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం కవిత ఓపెన్‌గా మాట్లాడిన ఈ మాటలతో బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి బిగ్ మైనస్‌గా మారాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: