రాజకీయమేంటి అంటే… ఇక్కడ ఏం జరుగుతుందో ముందుగానే ఎవరు చెప్పలేం. ఓడిపోతాననుకున్నవాడు గెలుస్తాడు, గెలుస్తాననుకున్నవాడు ఓడిపోతాడు. ఇలాంటి ఆటలు మనకు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని తన మాటలతో, తన జోష్‌తో ఒక్క దారిలో నడిపించి ఢిల్లీని వణికించిన బాస్ కేసీఆర్ – నేడు మాత్రం ఫాం హౌస్‌కే కేరాఫ్ అయ్యారు. 2023 ఎన్నికలలో గులాబీ బాస్‌కు బలమైన నమ్మకం ఉండేది. ఆరు నూరు కావచ్చు కానీ గెలుపు మాత్రం నా సొంతమే అని ధీమాగా చెప్పేవారు. కానీ ప్రజాస్వామ్యం తన తీర్పు చెప్పేసింది. రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సిఎం కుర్చీ ఎక్కేశారు. కలలో కూడా ఊహించని సీన్ రివర్స్ అయిపోయింది. ఆ షాక్‌ నుంచి బయటపడకముందే వరసగా దెబ్బలే దెబ్బలు.


కుమార్తె కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ ఎంట్రీ, సోంత ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌కి జంప్ అవ్వడం… ఇలా రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గ్రాఫ్ పడిపోవడమే తప్ప పెరగలేదు. ఈ దెబ్బలతోనే పెద్దాయన ఎర్రవెల్లి ఫాం హౌస్‌కే పరిమితం అయిపోయారు. సభలకు రావడం లేదు, పార్టీ మీటింగ్‌లలోనూ కనిపించడం లేదు. ప్రజల ముందుకి చివరిసారి రజతోత్సవం సమయంలో మాత్రమే వచ్చారు. దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి కూడా సెటైర్లు పేల్చేశారు – “అయన స్వయంగా ఫాం హౌస్‌లో నిర్బంధం చేసుకున్నారు, మరి వేరే జైలు అవసరమేంటి?” అని సూటిగా గుచ్చేశారు. ఈ మాట బాస్‌కు తగిలినదే కానీ బయటపెట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.



అయితే.. “బాస్‌కి టైమింగ్ బాగా తెలుసు” అని కేటీఆర్ చెప్పిన మాట ఇప్పుడు హాట్ టాపిక్. అంటే కాంగ్రెస్ పాలన మీద యాంటీ ఇంకెంబెన్సీ మొదలవుతుందనే లెక్కలేసుకుని, సరైన సీజన్ రాగానే కేసీఆర్ మళ్లీ జనాల్లోకి అడుగు పెడతారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం.గులాబీ కేడర్ మాత్రం ఒక్క మాటే అంటోంది – “బాస్ బయటకొస్తే ఆ కిక్కే వేరు.” అన్నీ అనుకూలిస్తే 2026లో కేసీఆర్ మళ్లీ కారెక్కి ప్రజల్లోకి రావడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. ఫాం హౌస్ నిశ్శబ్దం వెనక అసలు లెక్క‌ ఇదేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: