
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు మంగళవారం తెల్లవారు జామునే కొత్తగా కలొచ్చిందట. అదేమిటయ్యా అంటే మరో ఏడాదిన్నరలో దేశమంతా జమిలి ఎన్నికలు వచ్చేయబోతున్నట్లు. ఇంతకు ముందేమో మరో రెండేళ్ళల్లో జమిలి ఎన్నికలు ఖాయమని నేతలతో ఒకేటే ఊదరగొట్టిన విషయం చాలా కాలంగా జరుగుతోంది. ఇదే జమిలి ఎన్నికలు మరో ఆరుమాసాలు ముందుకు జరిగింది. అందుకనే రెండేళ్ళకు బదులు ఏడాదిన్నరలోనే జమిలి ఎన్నికలని మొదలుపెట్టేశారు. పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లశాతంలో 5 శాతం టీడీపీ లాగేసుకుంటే వైసీపీ ఇంటికెళిపోతుందని చాలా తేలిగ్గా చెప్పేశారు నేతలతో. అప్పటికి వైసీపీ ఓటు బ్యాంకును లాగేసుకోవటం అంటే తమ కుటుంబ ఆస్తులను, అప్పులు ప్రతిఏడాది మీడియా సమావేశంలో ప్రకటించినంత సులభం అన్నట్లుగా.
సరే చంద్రబాబు చెప్పినట్లుగానే ఏడాదిన్నరలోనే జమిలి ఎన్నికలు వస్తాయనే అనుకుందాం. వస్తే తెలుగుదేశంపార్టీ గెలిచేస్తుందని ఏమిటి గ్యారెంటి ? మొన్నటి ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయిన టీడీపీ 23 సీట్లకే పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక, టీడీపీకి భవిష్యత్తు లేదని అర్ధమైన తర్వాత చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేసేశారు. ఉన్న నేతల్లో కూడా చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిల్లో చాలామంది చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం దూరంగా పెట్టిన నేతలను, సామాజికవర్గాలకు అర్జంటుగా పార్టీ కమిటీల్లో చోటు కల్పించారు. అధికారంలో ఉన్నపుడు దూరం పెట్టేసి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాకీరి చేయటానికేనా తమకు పదవులిచ్చిందని చాలామంది మండిపోతున్నారు. అందుకనే పదవులు వచ్చినా పెద్దగా యాక్టివ్ గా లేరు.
నిజంగానే ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వచ్చినా అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి టీడీపీకి గట్టి అభ్యర్ధులు అందుబాటులో ఉన్నారా ? అన్నదే అసలైన ప్రశ్న. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా జిల్లాల్లో నేతలు ఇంకా గొడవలు పడుతునే ఉన్నారు. వాళ్ళ పంచాయితీ తీర్చలేక చంద్రబాబు కూడా చేతులెత్తేశారు. విజయనగరం, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయే కానీ పరిష్కారం కావటం లేదు. ఇదే సమయంలో వీలైనంతగా టీడీపీకి బొక్కపెట్టటానికి బీజేపీ వెనకాలే కాచుకుని కూర్చునుంది. కొద్దిగా బలమైన నేతలు అనుకున్న వాళ్ళని కమలం నేతలు తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. కాబట్టి జమిలి ఎన్నికలు వస్తే అధికారంలోకి వచ్చేయటం కాదు ఉన్న సీట్లు కూడా పోకుండా చూసుకుంటే అదే చాలా గొప్ప.