ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ పుష్పం ‘కుంకుమ పువ్వు’. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కుంకుమ పువ్వులను మనం గర్భిణులకు పాలలో కలిపి ఇవ్వడం చూస్తుంటాం. గర్భిణులు కుంకుమ పువ్వులను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని చెబుతుంటారు. అందుకే చాలా మంది ఈ చిట్కానే ఫాలొ అవుతుంటారు. అయితే ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందనేది ఎవరికీ తెలియదు. వాస్తవానికి కుంకుమ పువ్వులతో పుట్టబోయే పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.


కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా గర్భిణులు పాలల్లో కుంకుమ పువ్వును కలుపుకొని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుందని, పువ్వులో ఉండే మాంగనీస్‌తో శరీరానికి ప్రశాంతత చేకూరుతుందని వారు పేర్కొన్నారు. గర్భిణులకు నిద్రలేమి అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల నిద్రలేమిని దూరం చేసి మంచి నిద్ర వచ్చేలా చేస్తుందన్నారు. అలాగే శరీరంలోని కండరాలు రిలాక్స్ అవుతాయని, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా రక్త సరఫరా బాగా జరుగుతుందన్నారు.


తల్లి ద్వారా పుట్టబోయే పిల్లలకు చర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుందన్నారు. అంతేకాని కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు తెల్లగా పుట్టరని, ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల డీఎన్‌ఏ, జీన్స్ ఆధారంగా పుట్టబోయే బిడ్డకు రంగు వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. గర్భిణుల ఆరోగ్యానికి కుంకుమ పువ్వే మందు అని చెబుతున్నారు. అందుకే తప్పనిసరిగా గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవాలని చెబుతున్నారు.


గర్భిణులే కాకుండా సామాన్యులు కూడా కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోవచ్చన్నారు. కుంకుమ పువ్వులో ఉండే క్రోసెటిన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందన్నారు. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందన్నారు. అలాగే కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. దగ్గు, జలుబు, రక్తపోటు వంటి సమస్యలు తగ్గాలంటే.. వేడి పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు దరిచేరవన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: