అనంతపురం జిల్లా-కర్ణాటక సరిహద్దు ప్రాంతం అందమైన జీన్స్ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి జీన్స్ దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్లు మారుస్తున్నారు. నేటి తరానికి ఇక్కడి జీన్స్‌ హాట్ ఫేవరేట్‌గా మారిపోయాయి. 

 

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల దుస్తులు వచ్చినా... జీన్స్‌కు ఉన్న క్రేజే వేరు. అసలు జీన్స్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదంటే అతిశయోక్తి ఏమీ కాదు. జీన్స్‌లో నాలుగైదు రంగులే ఉన్నా..డిజైన్స్ మాత్రం చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు జీన్స్ తయారీకి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందింది. రాయదుర్గం అనంతపురం జిల్లాకు-కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అనంతపురం అంటేనే తీవ్రమైన కరువు ప్రాంతంగా పేరుంది. ఇక్కడ వ్యవసాయం భారమైన కొందరు టెక్స్ టైల్ వైపు మొగ్గు చూపారు. ఇక్కడి నుంచి కొందరు బయటి ప్రాంతాలకు వెళ్లి టెక్స్ టైల్స్ వృత్తిని బాగా నేర్చుకున్నారు. అనంతరం ఇక్కడికి వచ్చి మెల్లగా కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అవి క్రమంగా పెద్దదై ఇప్పుడు జీన్స్ ఎక్స్ పోర్టుకు కేంద్రంగా మారింది. రాయదుర్గంలో సుమారు 15వందల వరకు జీన్స్ దుస్తుల కంపెనీలు ఉన్నాయి. ఇందులో పని చేసే వారి సంఖ్య కూడా సుమారు 5వేల మంది వరకు ఉంటారు. పరోక్షంగా మరో ఐదు వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ తయారైన దుస్తులు ప్రధానంగా బెంగుళూరు, చెన్నై మహా నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. కొందరు వ్యాపారులు ముంబైకు కూడా ఎక్స్ పోర్టు చేస్తున్నారు. 

 

ఇక...ఇక్కడ జీన్స్ తయారీకి సంబంధించిన అన్ని పనులు జరుగుతుంటాయి. ఇందుకోసం నిపుణులైన టైలర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు రెండు మూడు రకాల జీన్స్ లు మాత్రమే ఇక్కడ తయారయ్యేవి. కానీ కాలంతో పాటు వీరు కూడా మార్పు చెందారు. అధునాతన మోడల్స్‌ను తయారు చేస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్‌కు తగిన విధంగా జీన్స్‌ ఫ్యాంట్లు, కోట్లు, తయారు చేయటం వీరి ప్రత్యేకత. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు లాంటి నగరాల్లో యూత్ ఎక్కువగా ఏ డిజైన్స్‌ను ఇష్టపడుతున్నారన్నది గమనిస్తారు. వాటినే ఇక్కడి వ్యాపారులు చేయిస్తున్నారు. షేడ్ జీన్స్, పెన్సిల్ కట్, నెటెడ్ వంటి వాటిని తయారు చేయడంలో వీరు మంచి ఫేమస్‌గా మారారు.

 

ఇప్పుడు మహా నగరాల్లో ఫ్యాషన్ అంటూ యువత వేసుకునే జీన్స్ దుస్తుల్లో ఎక్కుగా రాయదుర్గం ప్రాంతంలో తయారైనవే. ఇవన్నీ తొడిగేవారికి తెలియకపోయినా...దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. రాయదుర్గం జీన్స్ గురించి తెలిసిన చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యూత్ నేరుగా ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ధరలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఐతే...రాయదుర్గం ట్రెండీ జీన్స్‌కు ప్రభుత్వం ప్రమోట్ చేస్తే మరింత ఆదరణ లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: