
దేశీయ మార్కెట్లో పసిడి ధర రోజు రోజుకీ దిగొస్తోంది. బుధవారం ఒక్క రోజే రూ. 717 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 46,102కి పడిపోయింది. ముందురోజు ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,819గా ఉంది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే నేల చూపులు చూస్తోంది. ఒక్కరోజులోనే రూ. 1,274 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 68,239 పలికింది.

బంగారం ఇప్పుడే కొనాలా..? వాయిదా వేయాలా..?
ధర తగ్గడం సంతోషకరమైన విషయమే అయినా ఇప్పుడప్పుడే బంగారం కొనొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మరింతగా ధర తగ్గే అవకాశం ఉందని, కొన్నిరోజులు వేచి చూడాలని అంటున్నారు. సిప్ విధానంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మాత్రం మహూర్తాలు అక్కర్లేదని, ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టొచ్చని చెబుతున్నారు.
కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన వేళ.. అందరూ బంగారంలో పెట్టుబడులు మొదలు పెట్టారు. ఆ తర్వాత షేర్ మార్కెట్లు పుంజుకోవడంతో.. ప్రస్తుతం వాటిపై మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని, అందుకే రటు తగ్గుతోందని చెబుతున్నారు.