
పూరీ పుట్టుక ఎలా జరిగింది?
‘పూరి’ అనే పదానికి మూలం తెలుగులోని ‘పూరికా’. దీని అర్థం “పొంగినది”. తెలుగులో గాలితో పొంగే వస్తువులను “బూర” అని కూడా పిలిచేవారు. అలాగే పొంగే వంటకాలకు కూడా ఈ పోలిక వాడారు. 15వ శతాబ్దానికి చెందిన క్షేమకుతూహలం అనే వంటశాస్త్ర గ్రంథంలో శనగపిండితో చేసిన పూరి గురించి ప్రస్తావన ఉంది. అక్కడ “శనగ పూరికా” అని పిలిచారు. అంటే అప్పట్లో పూరీలు కేవలం గోధుమపిండితో కాకుండా శనగపిండితో కూడా చేసేవారని ఇది చెబుతుంది. సంస్కృత గ్రంథాల్లో పూరిని “పూరికా” అని, “పూరీతం” అంటే “లోపల నింపబడినది” అని అర్థం. అంటే లోపల తీపి లేదా కారంగా ఏదైనా నింపి కాల్చిన వంటకం. ఈ “పూరికా” పదమే క్రమంగా “పూరీ”గా మారింది.
పూరీల రూపాంతరాలు:
బొబ్బట్లు, ఆలూ పరాటాలు—ఇవి ఒకే కుటుంబానికి చెందిన వంటకాలు. వడ్డరాధనె అనే 10వ శతాబ్దపు కన్నడ గ్రంథంలో కూడా ఇలాంటి వంటకాల ప్రస్తావన ఉంది. కేటి అచ్చయ్య అనే ఆహార శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం, మన బొబ్బట్లునే పరాటాల మూల రూపం. గోధుమపిండిని వత్తి, లోపల శనగపప్పు–బెల్లం నింపి మళ్లీ వత్తి, కాల్చితే అదే బొబ్బట్లు. ఇవి అన్ని మొఘలాయుల ప్రభావం వల్ల వచ్చిన వంటకాలు కావు. భారతీయులు చాలా కాలం క్రితమే పూరీలు, పరాటాలు, బొబ్బట్లు వంటి వంటకాలు చేసేవారు. ఉత్తరాదిలో పూరణలున్న రొట్టెలు పెనం మీద లేదా నిప్పులమీద కాల్చినవిగా ప్రారంభమైతే, ఇక అదే తెలుగు వారు నూనే లేదా నేతిలో పొంగేలా వేగించి బూరెలు, పూరీలను సృష్టించారు. ఇదే చరిరే చెబుతుంది. రెండు వంటకాలు భారత ఉపఖండం అంతా ప్రాచుర్యం పొందినవే అని గుర్తుంచుకోవాలి.
పూరీల ప్రత్యేకత:
క్షేమకుతూహలం గ్రంథంలో చెప్పిన శనగ పూరికా: మూడు కప్పుల శనగపిండి, ఒక కప్పు గోధుమపిండి, కొద్దిగా ఇంగువ, వాము, ఉప్పు, అల్లం కలిపి ముద్ద చేసి నూనెలో వేయించేవారు. నేడు మనం తినే పూరి–కూర్మా కాంబినేషన్ హోటల్ కల్పన. పూరీకి కూర్మాను జత చేయడం చాలా తర్వాతి ఆవిష్కారం. పూరీలు కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, భారతీయ వంటకాల సృజనాత్మకతకు అద్దం పడిన ఆహారం. తీపిగా, కారంగా, రకరకాల రూపాలలో పరిణామం చెందిన పూరీలు నిజంగా తెలుగువారి వంటింటి గర్వకారణం.