సమాచార హక్కు చట్టం.. సరిగ్గా వాడుకుంటే ఇది ప్రజల తరపున పాశుపతాస్త్రం.. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేదు. ప్రజలు కూడా తమకు ఎంతో మేలు చేసే ఈ హక్కు గురించి తెలుసుకోవాలి. ఈ హక్కు ఉన్నది ప్రజల కోసమేనని.. ఒక్కసారి ఈ హక్కును వాడితే దీని పవర్‌ ఏంటో తెలుస్తుంది. ఏ విషయమైనా మనకెందుకులే అనుకోకుండా జనం తమ సమస్యలపై పోరాడాలని భావిస్తే.. ఈ ఆర్‌టీఐ చట్టం ఓ బ్రహ్మాస్త్రం అనే విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. దేశంలోని అనేక పెద్ద కుంభకోణాలు కేవలం ఈ చట్టం ద్వారానే  వెలుగు చూశాయి.  అందుకే సమాచార కమిషన్‌ జనంలో అవగాహన కోసం అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది.


ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబుదారీతనంతో అధికారులు నిర్ణీత సమయంలో అర్జీదారునకు సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది. తాజాగా తిరుపతి కలెక్టరేట్ నందు ఆర్.టి.ఐ దరఖాస్తులకు సంబంధించి కమీషనర్ కార్యాలయానికి అందిన వినతులపై సంబందిత శాఖల అధికారులతో, అర్జీదారులతో క్యాంప్ కోర్టు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సమాచారం కోసం అర్జీలు పెరుగుతున్నాయని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది.


పి.ఐ.ఓ. లు, అపిలేట్ అథారిటీలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తోంది. అధికారులు కార్యాలయాలలో భద్రపరిచే ఫైల్స్ ను ఇండెక్స్ ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాలని..  ఆర్.టి.ఐ. చట్టం మేరకు వెబ్ సైట్ లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచిస్తోంది. అర్జీదారునకు కోరిన సమాచారాన్ని త్వరగా అందించడానికి కృషి చేయాలని సూచిస్తోంది.


ఏపీలో అధికారుల పని తీరు కొంత మేర పనితీరు బాగుందని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతున్నా.. ఇంకా కొన్ని సందర్బాల్లో మాత్రం సమాచారం ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తుందని రాష్ట్ర సమాచార కమీషన్ భావిస్తోంది. అర్జీదారుల సమస్యలను క్షేత్రస్ధాయిలో చర్చించి అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rti