పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టుల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది.  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ పిటీషనర్ కోర్టు తలుపులు తట్టారు.  ఉద్యోగాల్లో స్ధానికులకు 75 శాతం రిజర్వేషన్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. స్ధానికులకు 75 శాతం అవకాశాలను చట్టబద్దమని ఎలా సమర్ధించుకుంటారంటూ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విజయవాడకు చెందిన వరలక్ష్మి అనే పిటీషనర్ వేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరించింది.

 

స్ధానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని పిటీషనర్ తప్పు పట్టడమే ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని పిటీషనర్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు అమలు చేస్తే  స్ధానికులే కదా లాభపడేది.  ఏ ప్రభుత్వమైనా  ఉద్యోగ, ఉపాధి కల్పనపైనే ప్రధాన దృష్టి పెడుతుంది. పరిశ్రమల ప్రోత్సాహకంలో భాగంగా సదరు కంపెనీలు, ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలివ్వటం అందరికీ తెలిసిందే. నీరు, విద్యుత్, భూ కేటాయింపు, మౌళిక సదుపాయాల కల్పన, పన్ను రాయితీలు .. ఇలా అనేక అంశాల్లో ప్రోత్సాహకాలిస్తుంది.

 

మరి ఇన్ని ప్రోత్సాహకాలిస్తుంది కాబట్టే 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో  స్ధానికులకు అవకాశం ఇవ్వాలంటూ  జగన్ ప్రభుత్వం ఓ చట్టం చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కియా కార్ల ఉత్పత్తి యూనిట్ సమయంలో కూడా చంద్రబాబునాయుడు 70 శాతం స్ధానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఒప్పందం చేసుకున్నాడు. కాకపోతే తర్వాత ఒప్పందాన్ని గాలికొదిలేశాడు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన స్ధానికుల్లో కొందరిపై కేసులు కూడా పెట్టింది టిడిపి  ప్రభుత్వం.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  జగన్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఇప్పటి వరకూ రాష్ట్రంలోని ఏ ఫ్యాక్టరీ, కంపెనీ, పరిశ్రమ కూడా అభ్యంతరం పెట్టలేదు.  ఒక ఫ్యాక్టరీ పెట్టేటపుడు స్ధానికులకే ప్రాధాన్యత ఇస్తే ఉపాధి, ఉద్యోగాలు లేవన్న కారణంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవనే చెప్పాలి.

 

ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కియా మోటారు కార్ల ఉత్పత్తి యూనిట్ వచ్చింది. తొందరలోనే తమ ప్రాంతంలో కార్ల ఉత్పత్తి యూనిట్ మొదలవుతోందని తెలియగానే  అక్కడి యువత సంబంధిత చదువుపై ఆసక్తి చూపారు. ఫిట్టింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి కోర్సుల్లో ఐటిఐ, పాలటెక్నిక్ చదివారు. అయితే చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవటంతో స్ధానికుల్లో అసంతృప్తి బయలుదేరింది.

 

అసలు యూనిట్ ఏర్పాటు కోసం రైతుల నుండి భూ సేకరణ సమయంలో చంద్రబాబు ఉద్యోగ, ఉపాధి పైన కూడా రైతు కుటుంబాలకు ఎన్నో హామీలిచ్చాడు. తర్వాత అన్నింటినీ గాలికోదిలేశాడు. ఫలితంగా పై ట్రేడ్లకు సంబంధించిన ఉద్యోగాల్లో తమిళనాడులోని యువతను  కియా యాజమాన్యం అనంతపురంకు తీసుకొచ్చింది. ఇటువంటి పరిస్ధితులు పునరావృతం కాకూడదన్న సదుద్దేశ్యంతోనే జగన్ 75 శాతం రిజర్వేషన్  నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కూడా పిటీషనర్  తప్పు పట్టడం  విచిత్రంగా ఉంది.

 

75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాల చట్టాన్ని మహారాష్ట్ర, తమిళనాడులోని రాజకీయ పార్టీలు స్వాగతించిన  విషయం అందరికీ తెలిసిందే.  చట్టం చేసిన ప్రభుత్వానికి, ఆమలు చేయాల్సిన ఫ్యాక్టరీలు, కంపెనీలకు లేని అభ్యంతరం మధ్యలో పిటీషనర్లకు ఎందుకు ?  చూడబోతే ఇది కూడా రాజకీయ ప్రేరేపితమైన కేసు లాగే ఉంది.  ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటుందో  ? కోర్టు ఏమి తేలుస్తుందో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: