కొంతమంది వ్యక్తుల గురించి గొప్పగా చెప్పడం అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ, గొప్ప వ్యక్తులు గురించి ఎంత గొప్పగా చెప్పు కున్నా, తక్కువే అవుతుంది. ఇంకా వారి జీవితం గురించి తెలుసుకుంటే, ఇంకా ఇంకా తెలుసుకోవాలనే అభిప్రాయం తప్పక కలుగుతుంది. అటువంటి మహానుభావులు అరుదుగా మాత్రమే మన మధ్య పుడతారు. మహోన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. తమ తమ గొప్ప పనులతో దేశంలోనే గొప్ప వ్యక్తులుగా ముద్ర వేయించుకుంటారు. అటువంటి మహోన్నత వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నా, అందరి వాడు గానే గుర్తింపు సాధించి, అన్ని పార్టీలకు ఇష్టమైన వ్యక్తిగా ముద్ర వేయించుకుంటారు. అటువంటి ముద్ర వేయించుకున్న గొప్ప వ్యక్తుల్లో అగ్రగణ్యుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరు గొప్పగా చెప్పుకోవచ్చు.

85 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడం ఎవరూ ఊహించని పరిణామమే. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ అజాతశత్రువుగానే తన జీవితాన్ని గడిపారు. పశ్చిమ బెంగాల్లోని భీర్భం జిల్లా మీరట్ లో1935లో బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. అసలు రాజకీయాల వైపు అడుగులు వేయకముందే ఆయన ఒక ప్రొఫెసర్ గా పని చేశారు. అంతేకాదు కొంతకాలం పోస్టల్ శాఖలో క్లర్క్ గానూ పనిచేశారు. అలాగే బెంగాలీ పత్రిక డేషర్ డాక్ లో జర్నలిస్ట్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆయనకున్న అపారమైన తెలివితేటలు చురుకుదనం, ఇవన్నీ గుర్తించే ఇందిరాగాంధీ ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావడమే కాక, నేరుగా రాజ్యసభలో కూర్చోబెట్టారు.

 కేంద్రంలో రక్షణ, వాణిజ్య, విదేశీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలన్నిటిని చేపట్టి చివరిగా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ కలం పార్లమెంటరీ నేతగానూ ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉండేవారు. వివిధ పార్టీల నాయకులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించే వారు. కేవలం ఆయనకు హిందీ భాష రాకపోవడం వల్లే, ప్రధాని కాలేక పోయారు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించాయి.

1969 నుంచి 2004 వరకు ఆయన వివిధ పదవుల్లో ఉన్నా, ఆయన ఎప్పుడు లోక్ సభకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలవలేదు. 2004 లో తొలిసారిగా జంగీపూర్ నుంచి లోక్ సభకు ఆయన ఎన్నికకావడంతో, ఆయన ఆనంద భాష్పాలతో కన్నీళ్లు సైతం కార్చారు. ఇక ఆయన పనిరాక్షసుడు గానూ పేరు సంపాదించుకున్నారు. 2015 లో ఆయన భార్య అనారోగ్యంతో మరణించగా, ఆమె అంత్యక్రియలలో పాల్గొని కొద్ది గంటల తర్వాతే తిరిగి తన విధులు నిర్వర్తించడం చూస్తే ఆయన ఎంతటి పనిరాక్షసుడు అనేది అర్థమవుతుంది.


ప్రణబ్ మరణం ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రణయ్ మృతితో రాజకీయ పార్టీలకు అతీతంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్ గా పనిచేసారు. దాదా అని ముద్దు పేరు కూడా ఆయనకు ఉంది. ఆ పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం తో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది.  

 - దాదా మళ్లీ ఎప్పుడు పుడతావ్ ..?  


   

మరింత సమాచారం తెలుసుకోండి: