దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణాలో జెండా పాతాలని గట్టిగానే డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే రాజన్న రాజ్యం తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మొన్నటి 9వ తేదీన వైఎస్ మద్దతుదారులు, అభిమానులతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పెద్ద సమావేశమే పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ మద్దతుదారులు, అభిమానులతో సమావేశాలు పెట్టి గ్రౌండ్ లెవల్లోని సమాచారం తెలుసుకుంటానని చెప్పారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి జిల్లా నేతలతో తాను సమావేశం అవ్వటం కాదని  అవసరమైతే తానే జిల్లాలకు వెళతానని కూడా చెప్పారు. అన్నట్లుగానే ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అవుతున్నారు. ఇందుకోసం ఆమె ఖమ్మం వెళుతున్నారు. తాను నేరుగా జిల్లాలకు వెళితే తన తండ్రి పాదయాత్రను గుర్తు చేసినట్లు ఉంటుందని షర్మిల భావించారట.




తన జిల్లాల పర్యటనను మొదట ఖమ్మంతోనే ఎందుకు మొదలుపెట్టారు ? ఎందుకంటే 2014 ఎన్నికల్లో జిల్లాలోని ఖమ్మం ఎంపితో పాటు మరో మూడు ఎంఎల్ఏ సీట్లను వైసీపీ గెలుకున్నది కాబట్టే. నిజానికి ఖమ్మం భౌగోళికంగా తెలంగాణాలో ఉన్నప్పటికీ ఆచార వ్యవహారాలు, వ్యాపార సంబంధాలు, సంస్కృతిలో  ఆంధ్రా ప్రభావమే ఎక్కువ. జిల్లాలోని చాలా ప్రాంతాలకు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాల సరిహద్దులున్నాయి. ఈ కారణంగానే ఖమ్మం జిల్లాలో పై జిల్లాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కూడా ఎక్కడా టీఆర్ఎస్ ప్రభావం కనబడలేదు.



చివరకు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభావం అంతంతమాత్రమే. అందుకనే ఈ జిల్లాను ఒకపుడు టీఆర్ఎస్ కూడా వదిలేసుకుంది. ఇటువంటి అనేక సానుకూలతలు ఉన్నాయి కాబట్టే ఖమ్మంపై షర్మిల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటివారంలోగా అన్నీ జిల్లాల నేతలతో సమావేశాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఎందుకంటే ఏప్రిల్ 10వ తేదీన రంగారెడ్డిలోని చేవెళ్ళలో పార్టీ ఏర్పాటు, విధి విధానాల ప్రకటన, జెండా, అజెండా అన్నింటినీ ప్రకటించాలని షర్మిల నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్ కు చేవెళ్ళ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి అదే పద్దతిని షర్మిల కూడా కంటిన్యు చేయబోతున్నారట. అందుకనే పార్టీ ప్రకటనకు చేవెళ్ళనే వేదికగా పెట్టుకున్నారట. ఒకవేళ పాదయాత్రను ప్రారంభించినా చేవెళ్ళ నుండే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట. మొత్తానికి ఏప్రిల్ 10వ తేదీ షర్మిల కు చాలా కీలకమని అర్ధమైపోతోంది. చూద్దాం ఆరోజు ఏమి జరగబోతోందో.

మరింత సమాచారం తెలుసుకోండి: