తెలంగాణలో సీఎం కేసీఆర్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయనకు స్వయంగా ఓ పేపర్, ఓ ఛానల్ ఉన్నాయి. ఇక ఆయన మిత్రుల ఆధ్వర్యంలో కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వీటికితోడు ప్రముఖ చానళ్లు ఉన్నా.. వాటి యాజమాన్యాలు ఆంధ్రా ప్రాంతానికి చెందినవి.. వాటిని కూడా నయానో భయానో కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏ పెద్ద మీడియా సంస్థ కూడా కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసే పరిస్థితి లేదు.

ప్రధాన మీడియాలో వీ6 న్యూస్ ఛానల్, వెలుగు పత్రిక మాత్రమే కాస్తో కూస్తో కేసీఆర్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓ ఛానల్ రోజూ కేసీఆర్ వైఖరిని, వైఫల్యాలను ఎండగడుతోంది. అదే రాజ్‌ న్యూస్ ఛానల్. బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా చెబుతున్న ఈ రాజ్ న్యూస్ ఛానల్‌.. నేరుగా కేసీఆర్ ను పేరు పెట్టి మరీ సవాల్ చేసేలా కథనాలు ఇస్తోంది.

అనేక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ హామీలు గుర్తు చేస్తూ.. వాటి సంగతేటి కేసీఆర్ అంటూ నిలదీస్తోంది రాజ్ న్యూస్ ఛానల్. గిరిజనులకు రిజర్వేషన్లు, నిరుద్యోగుల కష్టాలు, మంత్రులపై భూ కబ్జా ఆరోపణలు ఇలా ఒకటేంటి.. అన్ని అంశాలపై ప్రోమోలు చేస్తూ మరీ కేసీఆర్ సర్కారు దుమ్ముదులుపుతోంది రాజ్ న్యూస్. అయితే ఈ రాజ్ న్యూస్  ఛానల్‌కు అంతగా రీచ్ తక్కువ. అసలు ఈ ఛానల్ ఒకటి నడుస్తుందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు.

అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా తన రీచ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది రాజ్‌ న్యూస్. ప్రజాస్వామ్య మూలస్థంభాల్లో ఒకటైన మీడియా ఇప్పడు తన వంతు పాత్ర పోషించే పరిస్థితి లేనప్పుడు.. ఏదో ఒక ఛానల్ ఆ ప్రయత్నం చేయడం మంచిదే. అయితే ఈ రాజ్ న్యూస్ రాజకీయ ఎజెండా కూడా వేరే ఉండొచ్చు. ఉన్నా.. అల్టిమేట్ గా ప్రజలకు మేలు జరగడమే కావాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: