
అధికార పార్టీ నేతలు, నిత్యం ఏదో ఒక సమీక్షలు, సమావేశాలు, కార్యక్రమాలు అంటూ ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలావరకు సొంత నియోజకవర్గ ప్రజలతో టచ్ లోనే ఉన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉన్నారనే అపవాదు ఉన్నా కూడా.. జూమ్ ద్వారా ప్రతి రోజూ కార్యకర్తలు, నేతలతో టచ్ లోనే ఉన్నారు. మాక్ అసెంబ్లీ అంటూ ఆ పార్టీ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. రాగా పోగా, జనసేన యాక్టివిటి ఈమధ్య బాగా తగ్గినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. కరోనా తగ్గిన తర్వాత కూడా ఆయన నేరుగా తన సందేశాన్ని వినిపించలేదు.
ఏపీలో కరోనా కష్టాలపై, తిరుపతి రుయా ఘటనపై, రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై, తాజాగా ఏపీ బడ్జెట్ పై.. పవన్ స్పందిస్తున్నారే కానీ, కేవలం లేఖలు రాసి సరిపెడుతున్నారు. పవన్ విమర్శలు అలా స్టేట్ మెంట్లకు పరిమితం కావడంతో జనసైనికుల్లో కూడా కాస్త హుషారు తగ్గింది. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని రెండు పార్టీల నేతలు గొప్పగా చెప్పుకున్నారు. ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం తామేనన్నారు. తీరా రిజల్ట్ చూస్తే.. జనసేన-బీజేపీ ప్రభావం ఎక్కడా లేదని తేలింది. ఆ తర్వాత పార్టీ శ్రేణులు ఇంకాస్త డీలా పడ్డాయి. ఇప్పటికీ జనసేన ట్విట్టర్ అకౌంట్ లో తిరుపతిలో పవన్ జైత్రయాత్రనే పిన్డ్ ట్వీట్ గా పెట్టుకున్నారంటే.. ఆ తర్వాత అంతకంటే పెద్ద యాక్టివిటీ పార్టీలో జరగలేదని ఒప్పుకుంటున్నట్టా..? లేక ఓడిపోయిన ఎన్నికలకు ఇంకా ప్రచారం చేసుకుంటున్నట్టా..?
సగటు జనసేన అభిమానులు కూడా ఇదే విషయంపై అసంతృప్తిలో ఉన్నారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా.. పవన్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు, వివిధ నియామకాలు చేపట్టినట్టు.. అప్పట్లో ఫొటోలు విడుదల చేసి హడావిడి చేశారు. మరిప్పుడు ఆ హడావిడి ఏమైంది? జనసేనాని నిరుత్సాహపడితే.. జనసైనికుల పరిస్థితి ఏంటి..? పాతికేళ్ల భవిష్యత్ కి అర్థమేంటి..?