అసెంబ్లీలో ఎన్నికల్లో ఊహించని ఓటమితో… ప్రజాక్షేత్రానికి కేసీఆర్‌ దాదాపు దూరంగా ఉంటున్నారు.  కేటీఆర్‌, హరీష్‌ రావు.. ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్‌ యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ, కేసీఆర్‌ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మరోసారి అసెంబ్లీ సమావేశం కాబోతున్న వేళ.. కేసీఆర్‌ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.


ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఒకటి రెండు సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… పద్దు ప్రవేశపెట్టిన తొలిరోజు సభకు వచ్చిన కేసీఆర్‌, మీడియా పాయింట్‌ దగ్గర, ప్రభుత్వతీరును ఎండగట్టి వెళ్లిపోయారు.  ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్‌మీట్లు గాని నిర్వహించని కేసీఆర్‌.. ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? అని సర్వత్రా ఆసక్తినెలకొంది.  అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయమివ్వాలని మొదట్నుంచీ చెబుతున్న కేసీఆర్‌… ఆ సమయం గడిచాకే బయటకు వస్తారని చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు.


డిసెంబర్‌ 9తో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది.  ఇప్పటికే, కాంగ్రెస్‌ పార్టీ.. తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. కరెక్టుగా, డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. దీంతో, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ తన బాధ్యతను మరిచిపోవద్దనీ.. సభకు హాజరుకావాలనీ.. కేసిఆర్‌ రాకకోసం, ఎక్కిన వేదికమీదల్లా పిలుపునిస్తున్నారు, సవాల్‌ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.  



నేతలు,కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్‌ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి… కేసీఆర్‌ రాక మరింత జోష్‌ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.  అయితే, ఆయన రాకపై, బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు.  అసెంబ్లీ పూర్తిషెడ్యూల్ తెలిసాక కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.  ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరైనా, ఆయనకు తగినప్రాధాన్యత ఉంటుందా? సభలో కేసీఆర్‌కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా? అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా, అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా గెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: