వైసీపీ అధినేత జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన జీవించి ఉండగానే కడప ఎంపీగా పోటీ చేశారు. విజయం దక్కించుకున్నారు. ఇక ఆయన మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన విభేదాలు, వివాదాలతో బయటకు వచ్చారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. దీనికి కూడా వైయస్సార్ పేరునే పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు.


తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి బాటను మరిచిపోయిన నాయకులు మాత్రం చాలా వరకు తక్కువగా కనిపిస్తారు. ఇలాంటి వారిలో జగన్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడి పార్టీయేనా ఇది? అని వైసిపి పై విమర్శలు వస్తున్నాయి.


ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండగా రాజశేఖర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. హుందాతనానికి, మాట తీరుకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు, మహిళలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ విషయం టిడిపి నాయకులు కూడా ఒప్పుకుంటారు. కానీ ఈ తరహా పరిస్థితి వైసీపీలో రాను రాను తగ్గిపోతుంది. ఉదాహరణకు మహిళలపై వ్యాఖ్యలు చేసినా.. మహిళలను విమర్శించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి అసలు ఒప్పుకునే వారు కాదు.


అసెంబ్లీలో కూడా అప్ప‌టి స్పీకర్ ప్రతిభా భారతి ని `అమ్మ అమ్మ` అని ఆయన సంబోధించేవారు. ఇక తనను ఎవరు కలిసినా చెల్లెమ్మ అని పిలిచేవారు. పార్టీలోనూ అదే తరహా వాతావరణం ఆయ‌న పెంపొందించారు. ఎక్కడ ఏ చిన్న విమర్శ వచ్చినా ఆయన వెంటనే చర్యలు తీసుకుని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఆయన హయాంలో కనిపించాయి. అదేవిధంగా సమాజంలో ఉద్రిక్తతలు రాకుండ కూడా రాజశేఖర్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.


రప్ప రప్ప డైలాగులు వంటివి అప్పట్లో లేవు కానీ.. వివాదాస్పద అంశాలు మాత్రం ఉండేవి. ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవలు కనిపించేవి. వాటిని అణిచివేయడంలో చంద్రబాబుతో సమానంగా రాజశేఖర్ రెడ్డి కి మార్కులు పడ్డాయి. అలాంటి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే రప్ప రప్ప డైలాగులను సమర్ధించడం, కోసేస్తాం నరికేస్తాం అంటే వాటిని నవ్వుతూ ఆస్వాదించటం వంటివి తీవ్ర వివాదంగా మారాయి.


ఇక మహిళలపై వ్యాఖ్యలు సమర్ధించని రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ అదే స్థాయిలో ఉంటారని అందరూ ఆశించారు. కానీ పాలనలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహిళలపై పార్టీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన చూసి చూడనట్టు, విని విననట్టు వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఈయన వైయస్ తనయుడైనా ఆయన వారసత్వంతో రాజకీయాలు నడుపుతున్నారా అనే సందేహాలు  వస్తున్నాయి.


మరీ ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరసకు తనకు వదిన అయినా ప్రశాంతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న జగన్ మౌనంగా ఉండడం చూస్తూ కూర్చోవడం లాంటివి మరింతగా వివాదాస్పదంగా మారాయి. ఇక అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించకపోగా ఇంకా రెచ్చగొట్టేలాగా నాయకులను ప్రోత్సహించారు. ఇలాంటివి చూసినప్పుడు వైయస్ తనయుడిగా జగన్ తన ఉనికిని కోల్పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: