అయితే కనోస్కీ కొన్నేళ్లుగా ఎలుకల్లో ఆహారం, మెదడు పనితీరు మధ్య సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. చక్కెర పానీయాల వినియోగం ఎలుకల్లో జ్ఞాపకశక్తి పనితీరును దెబ్బతీస్తుందని ఆయన గుర్తించారు. ఇవి వాటి కడుపులో మంచి బ్యాక్టీరియాలో మార్పులకు కారణమవుతున్నాయని కూడా పరిశోధనలో తేలింది. చిన్నప్పుడు ఎదిగే క్రమంలో చక్కెర వినియోగం ఎక్కువ కావడం వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గుతోందని అధ్యయన బృంద సభ్యులు ఎమిలీ నోబెల్ తెలిపారు.
ఇక మనుషులు తాగే సాధారణ షుగర్ బెవరేజెస్ ను శాస్త్రవేత్తలు కౌమారదశలో ఉన్న ఎలుకలకు అందించారు. ఆ తరువాత ఎలుకల్లో గట్ బ్యాక్టీరియా(జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా)ను ప్రతి దశలోనూ తనిఖీ చేశారు. షుగర్ డ్రింక్స్‌ను తాగిన ఎలుకలు, సాధారణ నీరు తాగిన ఎలుకల గట్ బ్యాక్టీరియాలను విశ్లేషించి, రెండింటికీ మధ్య తేడాలను నమోదు చేశారు. షుగర్ డ్రింక్స్ తాగిన ఎలుకల్లో రెండు నిర్దిష్ట జాతుల గట్ బ్యాక్టీరియా పెద్ద సంఖ్యలో తయారైనట్లు గుర్తించారు. పరాబాక్టెరోయిడ్స్ డిస్కాసోనిస్, పారాబాక్టెరోయిడ్స్ జాన్సన్ని అనే ఈ రెండు రకాల బ్యాక్టీరియా సాధారణ నీరు తాగిన ఎలుకల్లో లేదని కనుగొన్నారు.
అంతేకాదు.. పారాబాక్టెరోయిడ్స్ బ్యాక్టీరియా ఎలుకల జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రయోగం చేశారు. ప్రయోగశాలలో పెంచిన పారాబాక్టెరోయిడ్స్ బ్యాక్టీరియాను వారు కేవలం నీరు తాగే కౌమార ఎలుకల కడుపులోకి మార్పిడి చేశారు. ఈ బ్యాక్టీరియాను కృత్రిమంగా చొప్పించిన ఎలుకల్లో కూడా జ్ఞాపకశక్తి లోపాలు ఏర్పడినట్టు గుర్తించారు. అవి యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు.. చక్కెర పానీయాలు తాగిన ఎలుకల మాదిరిగానే జ్ఞాపకశక్తి లోపాల బారిన పడ్డాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి